భార్యను విదేశాల నుంచి రప్పించాలంటూ...
తిరుపతి : తిరుపతిలో గత అర్థరాత్రి కలకలం రేగింది. విదేశాల్లో ఉన్న తన భార్యను రప్పించాలంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. స్థానిక బీటీఆర్ కాలనీకి చెందిన కరుణాకర్... కువైట్‌లో ఉన్న తన భార్య వరలక్ష్మిని వెంటనే రప్పించాలంటూ కుమారుడితో కలసి గృహ నిర్బంధం చేసుకొన్నాడు. కాగా కరుణాకర్, వరలక్ష్మిలకు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది.
కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లిన వరలక్ష్మి గత మూడు నెలలుగా భర్తతో ఫోన్లో మాట్లాడటం లేదని సమాచారం. దీంతో తన భార్యను వెంటనే తిరుపతికి రప్పించాలంటూ కరుణాకర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. భార్యను రప్పించకపోతే గ్యాస్ సిలిండర్ను పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు ఆరు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది. చివరకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కరుణాకర్‌ను బయటకు తీసుకొచ్చారు.