భార్య హత్య కేసులో యావజ్జీవం
♦ నిందితుడు గుంటూరులో వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగి
♦ నిందితుడి తండ్రి జడ్జి కావడంతో కేసు ఒంగోలుకు బదిలీ
ఒంగోలు సెంట్రల్: కిరోసిన్ పోసి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.45 వేల జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.వి.విజయకుమార్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలకు చెందిన లలిత ను 1995 సంవత్సరంలో గుంటూరుకు చెందిన ధర్మవరపు వెంకటరమణ వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో పది సంవర్ల బంగారం, రూ.70 వేల నగదును కట్నం కింద వధువు తరుపు వారు రమణకు ఇచ్చారు. రమణ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండటంతో అప్పట్లో చిలకలూరిపేటలో కాపురం పెట్టారు. అనంతరం పిడుగురాళ్లకు బదిలీ కావడంతో అక్కడకు మకాం మార్చాడు.
వైవాహిక జీవితంలో వీరికి ఒక పాప పుట్టింది. చెడు వ్యసనాలకు లోనైన రమణ, కనీసం ఇంటి ఖర్చులకు కుడా నగదు ఇవ్వకుండా లలితను వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2009 మే 23న లలిత పేరున చీరాలలో ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని లలితను వేధించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమె జననాంగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 90 శాతంకు పైగా కాలిన గాయూలతో ఉన్న లలితను ఎక్కడా చికిత్స అందించకుండా, ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికివ తరలిస్తూ కాలం గడిపాడు. ముందుగా పిడుగురాళ్ల వైద్యశాలకు అక్కడి నుంచి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐకి, అక్కడి నుంచి సమీపంలోని మణిపాల్‌కు ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్‌కి చికిత్స నిమిత్తం అంటూ తిప్పాడు.
మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత జీజీహెచ్‌లోపలికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి వైద్యాధికారులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితుడి తండ్రి జడ్జి కావడం, ఆయన గుంటూరులో కూడా పని చేసి ఉండటంతో పాటు గుంటూరు జిల్లా స్థానికులు కావడంతో కేసును ప్రకాశం జిల్లాకు బదిలీ చేయాలని బాధితులు కోరారు. నిందితుడు తెలివిగా మృతురాలి మరణ వాంగ్మూలం కూడా నమోదు కాకుండా మరణించే వరకూ అంబులెన్సులో తిప్పిన్నట్లు మృతురాలి సోదరులు వాపోయారు. వారి వినతి మేరకు కేసు ప్రకాశం జిల్లాకు బదిలీ అయింది. జిల్లా కోర్టులో నేరం నిరూపణ కావడంతో జడ్జి కె.వి.విజయకుమార్ పై శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శివరామకృష్ణ ప్రసాద్ తన వాదనలను వినిపించారు.