
లక్నో: కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో మూర్ఖుడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన నవనీత్(33)కు 12 ఏళ్ల క్రితం మంగేశ్ శుక్లా(30) తో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన నవనీత్ గురువారం పీకలదాకా మద్యం తాగి ఇంటికొచ్చాడు. అనంతరం తనకు కోడి గుడ్డు కూర వండాలని భార్యతో ఘర్షణ పడ్డాడు.
ఇందుకు ఆమె నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవనీత్ ఇంట్లో ఉన్న తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని, తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందకు యత్నించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. శుక్లా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నవనీత్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. శుక్లా ముగ్గురు పిల్లలను నవనీత్ తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment