ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ నీటిమట్టం
భారీ వర్షాలకు రాష్ట్ర రాజధాని వణికిపోతోంది. మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో సాగర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం స్థాయి 513.51 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 513.25 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశముంది. దీంతో సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలావుండగా నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది.