సీమాంధ్రులది ఉన్మాదం
నిజామాబాద్, న్యూస్‌లైన్ : సీమాంద్రులది ఉన్మాదమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిజామాబాద్‌లో జేఏసీ నిర్వహించిన శాంతి ర్యాలీ, ముల్కీ అమరుల దీక్షలో ఆయన మాట్లాడారు. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడితేనే పెళ్లవుతుందని, లేదంటే తప్పయితదని పేర్కొన్నారు. అదే అమ్మాయి కావాలని అబ్బాయి యాసిడ్ పట్టుకొని వెంటపడితే ఉన్మాదం అవుతుందని, ప్రస్తుతం సమైక్య ఉద్యమం అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ముఖం చూపెట్టలేక గుంటూరులో ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని, ఆ యాత్ర అక్కడే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ శాంతి ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరన్నారు. అద్వానీ, వాజ్‌పాయ్‌ల ఎదుట తెలంగాణ ఏర్పాటు వద్దని చెప్పిన చంద్రబాబు, 2009లో తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నదీ కూడా తానేనని ఎందుకు ఒప్పుకోవడంలేదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు.
కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన
హైదరాబాద్: ఈ నెల 7న ముల్కీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిటీ కళాశాల విద్యార్థి జేఏసీ, పాతనగర రాజకీయ జేఏసీ సంయుక్తాధ్వర్యంలో సన్నాహక కాగడాలు, కొవ్వొత్తులతో సిటీ కళాశాల చుట్టూ ప్రదర్శన నిర్వహించారు.
అమరువీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రదర్శనలో తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంటాక్ ఏపీ స్టేట్ కో-కన్వీనర్ ఎం.వేద కుమార్, తెలంగాణ జేఏసీ కో-కన్వీనర్లు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, ఎం.ఎస్. తిరుమల్ రావు, తదితరులు పాల్గొన్నారు.