
నాలుకలు కోసినా... కాళ్లు విరగొట్టినా సమ్మె విరమించం
హైదరాబాద్ : నాలుకలు తెగ్గోసినా.. కాళ్లు, చేతులు విరగ్గొట్టినా.. తెగ నరికినా సరే తాము కొనసాగిస్తున్న సమ్మె విరమించేది లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. తెలంగాణ ప్రజలపై విద్వేషంతో తాము ఉద్యమం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తమ ప్రసంగాలను వక్రీకరించటం భావ్యం కాదని అశోక్ బాబు బుధవారమిక్కడ అన్నారు.
తాను ఎవర్నీ ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదని...తమ ప్రసంగాల్లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కొంతమంది స్వార్థపరుల వేర్పాటు వాదం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని అశోక్ బాబు అన్నారు.
కేంద్రంలో ఎంపీలు రాజీనామాలు చేయటం ఎంత అవసరమో.... రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా ఉండటం అంతే అవసరం అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి తెలంగాణపై తీర్మానం వస్తే దాన్ని ఓడించాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి ఎమ్మెల్యేపై ఉందని అశోక్ బాబు అన్నారు.