పార్టీ నిర్ణయం తీసుకున్నా, నేను వ్యతిరేకిస్తున్నా:సిఎం
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభలో ఈ సాయంత్రం ఆయన ప్రసంగించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందన్నారు. పుట్టినప్పటి నుంచి తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, సోనియా గాంధీ వల్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. అయినా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల మేలు కోసమే విశాలాంధ్ర ఏర్పడిందని చెప్పారు.
పార్లమెంట్‌లో ఇందిరా గాంధీ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మన రాష్ట్రం గురించి ఇందిర స్పష్టంగా మాట్లాడారని చెప్పారు. ముల్కీ,14 ఎఫ్‌లను బలవంతంగా తొలగించారన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగు వారందరూ కలిసి ఉండాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. వెనుకబాటు తనాన్ని చూపి విభజన ఇందిరా గాంధీ వద్దన్నారని చెప్పారు. నాటి ఇందిర ప్రసంగం ఇప్పుడు ఎంతో అవసరం అన్నారు. విభజన ఏ మాత్రం పరిష్కారం కాదని ఆమె చెప్పినట్లు తెలిపారు.
రేపు ఒక్కో జిల్లా ఒక్కో రాష్ట్రంగా మార్చుతామంటే ఏలా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనేది వేల ఏళ్లుగా ఉన్న ఒక రాష్ట్రం - బుద్ధుడి కాలం నుంచి తెలుగువాళ్లు కలసి ఉన్న రాష్ట్రం - కొంతకాలం మినహా తెలుగువారందరూ కలిసే ఉన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండాలని ఇందిర కోరుకున్నట్లు తెలిపారు. విభజనతో పరిష్కారం అభిస్తుందని అనుకుంటే పొరపాటని ఆమె చెప్పిన విషయం గుర్తు చేశారు. పార్లమెంట్ జాతి సమగ్రతకు అద్దం పట్టాలని ఇందిర అన్నారని తెలిపారు. తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు.
దేశాన్ని ముక్కలు చేయడం సరికాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు జాతి సమగ్రతలో ఒక భాగం. తెలుగు వారు ఎప్పుడూ, రాష్ట్రానికి, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు. మొదటి ఆర్టికల్‌లో మన దేశం సమాఖ్య అని పేర్కొంది. రాజధాని రెండు ప్రాంతాల్లో ఉందని గుర్తించాలని ఇందిర చెప్పినట్లు సిఎం తెలిపారు.