యూనివర్సిటీ ప్రాంగణంలో నాటిన మొక్కకు నీరు పోస్తున్నఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను.
కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’
అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్‌పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’
అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు.
చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’
అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు..
‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది.
విశాఖలో నేను తిరగని వీధిలేదు.
అప్పట్లో ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు.
మావి హ్యాపీ డేస్..
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను.
మా క్లాస్‌మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment