
టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాంబశివరావు
అమరావతి:
తిరుమల-తిరుపతిదేవస్థానం (టీటీడీ) చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను కూడా సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ జీవో ఇచ్చింది. తెలుగువారినే టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా నియమించే సంప్రదాయం ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలుగువారికే ఈ పోస్టు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారనే విషయం సీనియర్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రి చేసిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఈవోగా ఉన్న డి. సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసి ఈ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టే వరకూ ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని ప్రస్తుతం అక్కడ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అర్జ శ్రీకాంత్‌ను ఆదేశించింది. కృష్ణాజిల్లా కలెక్టరుగా పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎ. బాబును ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న కె. సాంబశివరావు (ఐఆర్‌టీఎస్)ను బదిలీ చేసింది. రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా ఎ. బాబుకు అప్పగించింది. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జె.నివాస్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.