ఓ మైనర్ కు పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అధికారులు ఆ పెళ్లిని అడ్డుకుని బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ముషీరాబాద్ (హైదరాబాద్) : ఓ మైనర్కు పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అధికారులు ఆ పెళ్లిని అడ్డుకుని బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ అడిక్‌మెట్ డివిజన్ గణేష్‌నగర్‌లో నివసించే రాములు, సునీతల కూతురు హేమలత(16) వివాహం.. శంకర్‌పల్లికి చెందిన జంగయ్య, కళావతిల కుమారుడు నరేష్‌తో శుక్రవారం అడిక్‌మెట్ డివిజన్‌లోని లలితానగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. పెళ్లి మండపంపై పెళ్లి కుమారుడు నరేష్ వేచి ఉన్నాడు.
అయితే పెళ్లి కూతురు హేమలతకు 16 సంవత్సరాలే ఉన్నాయని బాలిక సంరక్షణ విభాగం (ఐసీడీఎస్) సూపర్‌వైజర్ హంసవేణికి కొందరు ఫిర్యాదు చేయగా వెంటనే సమీపంలోని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి హుటాహుటిన ఆమె పెళ్లి మండపానికి వచ్చారు. అయితే అప్పటికీ పెళ్లి కూతురు పెళ్లి మండపానికి చేరుకోకపోవడంతో అధికారులే స్వయంగా గణేష్‌నగర్‌లో గల పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి ఆమెను వారితోపాటు తీసుకెళ్లారు. నింబోళి అడ్డాలోని బాలిక సంరక్షణ కేంద్రానికి పంపారు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది.