బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
కర్నూలు(హాస్పిటల్): దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో త్వరలో జరగబోయే బాల్యవివాహాలను స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు మార్చి 2, 3వ తేదీల్లో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీపీఎస్ డీపీసీవో శారద, ఐసీడీఎస్ పత్తికొండ సీడీపీవో టి. విద్య గ్రామానికి వెళ్లి బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, చట్టం గురించి వివరించారు. బాలికలకు మైనార్టీ(18 సంవత్సరాలు వచ్చేంత వరకు) తీరేంత వరకు పెళ్లి చేయబోమని వారితో అంగీకార పత్రాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుచరిత, చైల్డ్‌లైన్ టీమ్ మెంబర్ అనిత ఉన్నారు.