
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరు
సీఎం చంద్రబాబు నాయుడు
గుంటూరు సిటీ : మహిళల ఆత్మగౌరవ నినాదంతో సత్తెనపల్లిని ఆదర్శంగా తీసుకుని 2015 మార్చి నెలాఖరు నాటికి జిల్లా అంతటా మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ గుంటూరుగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం ముఖ్యమంత్రి సత్తెనపల్లి, గుంటూరు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
‘స్వచ్ఛ సత్తెనపల్లి’ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి గుంటూరు చేరుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ర్టంలో గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అయితే జిల్లాలో సత్తెనపల్లి పార్టీకి కంచుకోటని పేర్కొన్నారు. అందుకే రాష్ర్టంలోనే ఒక చక్కని కార్యక్రమానికి వేదికగా నిలి చిందని ప్రశంసల జల్లు కురిపించారు. శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రతిష్టాత్మకంగా తన నియోజకవర్గాన్ని స్వచ్ఛ సత్తెనపల్లిగా తీర్చిదిద్దుకునే దిశలో అందరికన్నా ముందడుగు వేశారని సీఎం అభినందించారు.
20వేల మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇటు అధికారులు, అటు ప్రజల్లో కదలిక తెచ్చారని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఒక సవాల్‌గా స్వీకరించాలన్నారు. అనంతరం అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించా రు. సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో 7.26 లక్షల ఇళ్లకు 4.50 లక్షల ఇళ్లల్లో ఇప్పటికే మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. సీఎం ఆదే శం మేరకు మార్చి నెలాఖరులోపు జిల్లాలో శతశాతం మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛగుంటూరుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.
తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి చేరుకున్న చంద్రబాబు ఆ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఇరుకుపాలెం వెళ్లి అక్కడా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, పార్టీ నేతలు జేఆర్ పుష్పరాజ్, మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, రాయుడు విశ్వేశ్వరరావు, డీఆర్‌ఓ కొసన సుబ్బారావు, డీఆర్‌డీఎ పీడీ ప్రశాంతి, డ్వామా పీడీ ఢిల్లీరావు పాల్గొన్నారు.
గ్రామస్తులతో సీఎం మాటా-మంతి
సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి, ఇరుకుపాలెంలో గ్రామస్తులతో సీఎం తనదైన శైలిలో మాట్లాడారు. ‘ఏమ్మా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఏం పెద్దయ్యా మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టించావా? మరుగుదొడ్డి నిర్మించక ముందు బాగుందా? ఇప్పుడు బాగు ందా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నలు గుప్పించారు. ‘మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఇంకా బహిరంగ మల విసర్జన ఘోరం. ఇది తెలుగు ఆడబిడ్డల ఆత్మగౌరవ సమస్య. మరుగుదొడ్డి నిర్మాణాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి’అని పిలుపునిచ్చారు.