‘గుర్తింపు' లేని వైద్యం | 'Identity' is not healing | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు' లేని వైద్యం

Published Sun, Nov 2 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

‘గుర్తింపు' లేని వైద్యం

‘గుర్తింపు' లేని వైద్యం

వైద్యశాలలు దేవాలయాలతో సమానం. కష్టాల్లో ఉన్న వారు దేవుని కరుణ కోసం ఆలయాలకు వెళుతున్నట్టే అమూల్యమైన ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వైద్యాలయాలకు వెళుతుంటారు. అలాంటి వైద్యాలయాలు సేవకు ప్రతీకగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వైద్యోనారాయణ హరీ అనే నానుడికి సార్థకత. ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా వైద్య సంస్థలు వెలుస్తున్నాయి. అర్హతలతో నిమిత్తం లేకుండా పుట్టగొడుగొల్లా ఆస్పత్రులు నెలకొల్పడం వెనుక సంబంధిత అధికారుల ధనదాహం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
వైద్య వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి ఎన్ని అంటే స్వయానా జిల్లా వైద్యారోగ్యశాఖ సమాధానం చెప్పలేని దుస్థితి. కాసులిస్తే ఎలాంటి వాటికైనా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అనుమతి ఇస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ప్రజల ప్రాణాలతో చెలగాటం
 నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కొందరు నకిలీ వైద్యులు చెలగాటమాడుతున్నారు. విచ్చలవిడిగా  క్లినిక్‌లు, నర్సింగ్ హోంలను నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వీటిని ఎక్కువగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు కనిపించేవారు. నేడు నగర, పట్టణాలకు వ్యాపించారు. వాస్తవానికి వీరు దగ్గు, జ్వరం వంటి సాధారణ రుగ్మతలకు మాత్రమే వైద్యం అందించాలి.

అయితే ఆర్‌ఎంపీలు ఏకంగా హయ్యర్, లేటెస్ట్ యాంటి బయాటిక్ మందులను సూచిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌లను యథేచ్ఛగా నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి ఎంబీబీఎస్ స్పెషలిస్ట్‌లు మాత్రమే హయ్యర్, లేటెస్ట్ యాంటి బయాటిక్స్‌ను సూచించాల్సి ఉంది. మరికొందరు మందుల దుకాణాలనే క్లినిక్‌లుగా మార్చేశారు.

 తనిఖీలు నిల్
 వైద్యశాలలు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తుండాలి. కాని ఎక్కడా అలా జరగడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 313 ఆస్పత్రులు, క్లినిక్, నర్సింగ్‌హోంలు రిజిస్టర్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 17 వరకు రెన్యువల్ కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అనధికారికంగా వేల సంఖ్యలో క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యులే వీటిని ఎక్కువగా నడుపుతున్నట్టు తెలిసింది.

ఉదాహరణకు నెల్లూరు జూబ్లీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు గత పది నెలలుగా లాంగ్‌లీవ్‌లో ఉంటూ స్థానిక పొగతోటలో సొంత వైద్యశాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలాగే డీఎస్‌ఆర్ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న మరో వైద్యుడు తనకు ఆరోగ్యం బాలేదని రెండు నెలల క్రితం సెలవుపై వెళ్లి పొగతోటలోని తన క్లినిక్‌లో తిష్టవేసిన విషయం బహిరంగ రహస్యమే.

 నిబంధనలు ఇవే..
  వైద్యశాల, నర్సింగ్‌హోం, క్లినిక్‌లను ఏర్పాటు చేయాలంటే నాన్ జ్యుడిషయరీ స్టాంప్‌తో నోటరీ డిక్లరేషన్ తప్పనిసరి. అద్దె భవనమైతే రెంటల్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం.
   వైద్యుల అర్హత ధ్రువీకరణ పత్రాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వం నకలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కాపీ, ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సుల అర్హత, సిబ్బంది వివరాలు, ఆస్పత్రి పరికరాలు, వైద్యసేవల వివరాలు, ఆస్పత్రి ప్రాంగణం, ఆపరేషన్ గది, రోగుల వెయిటింగ్ హాల్ ఫొటోలు, అగ్నిప్రమాద నిరోధక యంత్రాలను అమర్చుకోవడం తప్పనిసరి.
 
 రిజిస్ట్రేషన్ ఖర్చులు
 డీఆర్‌ఏ, డీఎంహెచ్‌ఓ నెల్లూరు పేరుతో ఏదైనా జాతీయ బ్యాంక్‌లో డీడీ తీయాలి. ఐదేళ్ల రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
  క్లినిక్/ కన్సల్టేషన్ రూం రూ.1,250. పాలిక్లినిక్ రూ.2,500
  20 పడకల కన్నా తక్కువున్న హాస్పిటల్/నర్సింగ్ హోం రూ.3,750
  21 నుంచి 50 పడకలకు రూ.7,500
  50 నుంచి 100 పడకలకు  రూ.10 వేలు
 101 నుంచి 200 పడకలకు రూ.15 వేలు
  200కు పైబడిన పడకలు కలిగిన
      ఆస్పత్రికి రూ.37,000
  డయాగ్నస్టిక్ సెంటర్ (బేసిక్ ల్యాబ్) రూ.2,500
  డయాగ్నస్టిక్ సెంటర్ విత్ హయ్యర్ ఎక్విప్‌మెంట్ రూ.10,000
  ఫిజియోథెరపీ యూనిట్స్ రూ.3,750

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement