ఇసుక స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు
► స్మగ్లర్లపై క్రిమినల్ కేసులు
► మూడుసార్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్
► అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం
► ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6401
అనంతపురం అర్బన్ : ఇసుకను ఎవరైనా ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేయాలని, మూడు సార్లు తప్పు చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 1800 425 6401 ఏర్పాటు చేశామన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్‌డీఓలు, డీఎస్‌పీలతో ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం పక్కదారి పట్టకూడదన్నారు.
జిల్లాలో కంబదూరు మండలం చెన్నంపల్లిలో మూడు రీచ్‌లు, రాంపురం, రామగిరి మండలం పేరూరు, బ్రహ్మసముద్రం మండలం అంజినయ్యదొడ్డి, కన్నపల్లి, కాళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో రెండు రీచ్‌లు మొత్తం తొమ్మిది రీచ్‌లలో ఒక మీటరు లోపు కూలీల చేత ఉచిత ఇసుకను తవ్వకోవచ్చన్నారు. ముదిగుబ్బ మండలం పెద్ద చిగుల్ల రేవు, శింగనమల మండలం ఉల్లికల్లు, తాడిపత్రి మండలం చిన్న చిగుల్ల రేవుల్లో యంత్రాలతో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి ఒక మీటరు లోపున ఇసుక తవ్వుకోవచ్చన్నారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాలన్నారు.
రాత్రి తొమ్మిది గంటల తరువాత ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. యంత్రాలతో తవ్వే రీచ్‌ల్లో ఇసుకను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ (గ్లోబెల్ పోజిషనింగ్ సిస్టం) అమర్చాలని ఆదేశించారు. రీచ్‌ల వద్ద స్థానికుల గుత్తాధిపత్యం లేకుండా చూడాలన్నారు. ఇసుక వాహనాలను, రవాణా ధరను స్వచ్ఛందంగా డీటీసీ వద్ద లేదా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించే వె సులుబాటు కల్పించాలన్నారు.