ఫిర్యాదు వస్తే పరిస్థితేంటి? | If the complaint paristhitenti? | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు వస్తే పరిస్థితేంటి?

Published Sat, Apr 11 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

ఫిర్యాదు వస్తే పరిస్థితేంటి?

ఫిర్యాదు వస్తే పరిస్థితేంటి?

  • ఎవరు ఆశ్రయించినా హత్యానేరం కేసు పెట్టాల్సిందే
  • స్పెషల్లీ గ్రేవ్ అఫెన్స్ నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తు
  • శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు ప్రారంభమైతే సమస్యలే
  • ‘భవిష్యత్తు’పై మల్లగుల్లాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
  • సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ‘ఎన్‌కౌంటర్’పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఇప్పటివరకు స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్య. హ త్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే ‘భవిష్యత్తు’ ఎలా ఉంటుందో అనే అంశంపైనే సర్కారు మల్లగుల్లాలు పడుతోంది.
     
    ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు..

    చట్ట ప్రకారం కొన్ని నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేసే అంశంలో లోకస్ స్కాండీ కీలకంగా మారుతుంది. దీని ప్రకారం సదరు నేరంలో బాధితులుగా మారిన, బాధితులకు సంబంధీకులైన వారు మాత్రమే దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. శేషాచలంలో జరిగిన ఉదంతం 20 మంది కూలీల ప్రాణాలకు సంబంధించిన, మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో కూడింది కావడంతో ఈ అంశంలో లోకస్ స్కాండీ వర్తించదు. బాధిత కుటుంబీకులు, సంబంధీకులు మాత్రమే కాదు పౌరహక్కుల సంఘాలతో పాటు ఎవరైనా హత్య ఆరోపణలపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేయడానికి అధికారులు తిరస్కరిస్తే న్యాయస్థానాన్నీ ఆశ్రయించవచ్చు.
     
    స్పెషల్లీ గ్రేవ్ అఫెన్స్ పరిధిలోకి..

    సాధారణంగా హత్య ఆరోపణలపై నమోదైన కేసుల్ని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తారు. వీటిని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. శేషాచలం ఘటనకు సంబంధించి సచ్చినోడిబండ ప్రాంతంలో 11 మంది, చీకటీగల కోనలో 9 మంది తమిళనాడుకు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహావి చట్ట ప్రకారం స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల పరిధిలోకి వస్తాయి. వీటిని డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి.  నిబంధనల్ని  అనుసరించాల్సిందే.
     
    సున్నితాంశాలు వెలుగులోకి రావాలి..

    హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే కచ్చితంగా ప్రతి అంశాన్నీ పక్కాగా నిర్థారించాలి. మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటనా స్థలి వరకు ప్రతి ఘట్టాన్నీ సాక్ష్యాధారాలతో సహా రికార్డులకు ఎక్కించాలి. దీనికోసం ప్రాథమికంగా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌ఫోర్స్ బలగాల పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు వారు వినియోగించిన ప్రతి తుపాకినీ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. బలగాలు కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనల్ని పాటించాయా? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు, ఏ తూటా వల్ల చనిపోయారు? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది? ఆ తుపాకీని వినియోగించింది ఎవరు? అనేవి స్పష్టంగా తేల్చాలి.
     
    ‘లోపాలు’ వెలుగు చూస్తాయనే భయం..
     
    ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాలతో పాటు ప్రత్యక్ష సాక్షులు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఎర్రచందనం కూలీలను గుడిపాల వద్ద అదుపులోకి తీసుకుని, అక్కడ ఓ ఇంట్లో బందీలుగా ఉంచి, మంగళవారం తెల్లవారుజామున శేషాచలం తీసుకువచ్చి కాల్చిచంపారు. హత్యకేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్నీ నిర్థారించుకుంటూ రావాల్సి ఉంటుంది. స్వస్థలాల నుంచి కూలీలు బయలుదేరింది మొదలు వారు ప్రయాణించిన మార్గం, బసచేసిన ప్రాంతం, శేషాచలంలోకి చేరుకున్న విధానం, ఆయుధాల సమీకరణ, వాటిని ప్రయోగించిన విధానం ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. కేవలం రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసిన కూలీలపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణారహితంగా కాల్చేయడం ‘రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్’ కిందికి రాదు. ఈ ‘భవిష్యత్తు ఆందోళనలు’ ప్రభుత్వానికి గుబులు పుట్టిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement