ఎన్నికల వేళ.. బదిలీల గోల | If the election .. Tional transfers | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. బదిలీల గోల

Published Sun, Jan 19 2014 3:54 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

If the election .. Tional transfers

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. జిల్లాలో మూడేళ్లు సేవలందించిన వారికి బదిలీ తప్పనిసరి కానుంది. సీఐలు, ఎస్‌లకు కచ్చితంగా స్థానచలనానికి అవకాశం ఉండటంతో వారంతా ఇప్పటినుంచే తమకు అనుకూలమైన పోలీస్‌స్టేషన్లను వెతికేపనిలో పడ్డారు. బదిలీ ప్రక్రియ జరిగితే పాలమూరు నుంచి 33 మంది తహశీల్దార్లు.. 15 మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలకు కుర్చీలు కదలడం ఖాయం..
 
 కలెక్టరేట్/మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ముందుగా జిల్లా రెవెన్యూ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే జిల్లాకు చెందిన పలువురు అధికారులతో పాటు జిల్లాలో మూడేళ్ల సర్వీసు నిండిన వారిని ఇతరప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీరంతా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తారు. ఈ జాబితాలో గద్వాల ఆర్డీఓతోపాటు జిల్లాలో పనిచేస్తున్న 33మంది తహశీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది.
 
 అయితే బదిలీలకు సంబంధించి ఎంతమంది అర్హత ఉన్న వారు ఉన్నారో జాబితాను సిద్ధం చేయాలని గతంలో ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు అధికారులు ఆ జాబితాను సిద్ధంచేశారు. ఇక మిగిలిన 31మంది తహశీల్దార్లు కొద్దినెలల క్రితమే నల్గొండ జిల్లా నుంచి జిల్లాకు వచ్చినవారే కావడంతో వారికి బదిలీలు లేవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.  
 
 నెలాఖరులోగా ఉత్తర్వులు
 జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్లను కూడా బదిలీ చేసేందుకు అధికారులు జాబితాను సిద్ధంచేసే పనిలో పడ్డారు. అయితే వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయకుండా జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మాత్రమే బదిలీ చేయనున్నారు. అదేవిధంగా వీఆర్వోలకు కూడా ఈ సారి బదిలీ ప్రక్రియ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
 
 వీరు కూడా డివిజన్లను మారాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే జాబితాను సిద్ధంచేసే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఇటీవల సూచించిన మేరకు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెలాఖరు వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ జరిగిన ఒకటి రెండు రోజుల్లోనే బదిలీపై వెళ్లాల్సిన వారు ప్రస్తుతస్థానాన్ని వీడాల్సి ఉంటుంది. ఇక బదిలీపై వెళ్లేవారికి ఎక్కడికి పోస్టింగ్స్ ఇస్తారోననే పరేషాన్‌లో పడ్డారు. వీరంతా సాధారణ ఎన్నికల తరువాత మళ్లీ మన జిల్లాకు తిరిగి రానున్నారు. అంతవరకు యథాస్థానంలోనే పనిచేయాల్సి ఉంటుంది.
 
 జిల్లా పోలీసుశాఖలో..
 మన జిల్లాలో 15మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలకు బదిలీ జరగనుంది. జిల్లాకు వచ్చి జనవరి 31 నాటికి మూడేళ్లు పూర్తయిన వారు బదిలీజాబితాలో చేరుతారు. జిల్లాలో ఎస్‌ఐగా పనిచేసి పదోన్నతిపై సీఐగా జిల్లాలోనే పనిచేస్తున్న వారికి కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. కాగా, మూడేళ్ల పదవీకాలం పూర్తయిన అధికారుల జా బితాను పోలీసుశాఖ ఇదివరకే ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. స్పెషల్‌బ్రాంచ్, శిక్షణ లో ఉన్న అధికారులు, కంప్యూటరైజేషన్ విభాగా ల్లో పనిచేసేవారికి ఈ నిబంధ వర్తించదు. సొంత నియోజకవర్గాల్లో పనిచేసే ఎస్‌ఐల కాలపరిమితి మూడేళ్లు పూర్తికాకపోయినా వారిని ఆ నియోజవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీచేసే అవకాశం ఉంది. పోలీస్ సబ్‌విజన్‌ను కూడా మార్చాల్సి ఉంటుంది. ఎన్నికల నాటికి పోలీసు అధికారుల మీద క్రిమినల్ కేసులు ఉన్నా.. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా వారు ఎన్నికల విధులకు అనర్హులు అవుతారు.
 
 గత ఎన్నికల విధుల్లో పొరపాట్లు చేసిన అధికారులను కూడా జిల్లా మార్చాలన్న నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పోలీసు అధికారులను బదిలీచేయాల్సినా.. నియమించాలని భావిం చినా తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. మరో రెండు మూడునెలల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బదిలీ అధికారుల జాబితాను సిద్ధంచేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement