హిందూపురం అర్బన్, : మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలను విస్మరిస్తే ఖబడ్దార్ అంటూ హిందూపురంలో దళితులు హెచ్చరించారు. 19వ వార్డు టికెట్ తమకు కేటాయించకపోతే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయమని పేర్కొన్నారు.
హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో మాదిగలు ఎదగకుండా టీడీపీ నాయకులు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకుడు మోదశివ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం రాత్రి ఆయన 19వ వార్డు దళితులతో కలిసి వచ్చి ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ ఇంటి ఎదుట ధర్నా చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని రోడ్డుపై బైఠాయించారు. మాదిగలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు చేతల్లో ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
19వ వార్డులో పట్టుమని పది ఓట్లు కూడా లేని వారికి టికెట్టు కేటాయించారని, ఎక్కువ ఓట్లు ఉన్న మాదిగలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో చేరిన అంబికా లక్ష్మినారాయణ వర్గీయుడైన తనకు టికెట్టు కేటాయిస్తే పార్టీలో అంబికా వర్గం బలపడుతుందని ఎమ్మెల్యే అబ్దుల్ ఘని తనకు టికెట్టు కేటాయించలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. హిందూపురం పట్టణంలోని 20 వేల ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గానికి టీడీపీలో కనీసం రెండు మూడు టికెట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. పార్టీలో ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరిస్తూ దళితులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు.
మాదిగలకు న్యాయం చేయకపోతే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం మాదిగ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపడుతామని చెప్పారు.