సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో ఐఐటీలో ప్రవేశించేందుకు నిర్వహించే జేఈఈ(అడ్వాన్స్‌డ్)-2014 ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది మే 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ-ఖరగ్‌పూర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్దేశించిన జేఈఈ-మెయిన్-2014లో ఉత్తీర్ణులై మెరిట్ జాబితాలో ఉండే లక్షన్నర మంది ప్రతిభావంతులు మాత్రమే ఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
జేఈఈ-మెయిన్ ఉత్తీర్ణుల్లో 50.5 శాతం(75,750) మందిని కామన్ మెరిట్ లిస్ట్ నుంచి, 27 శాతం(40,500) మందిని ఓబీసీ మెరిట్ లిస్ట్ నుంచి, 15 శాతం(22,500) మందిని ఎస్సీ మెరిట్ లిస్ట్ నుంచి, 7.5 శాతం(11,250) మందిని ఎస్టీ మెరిట్ లిస్ట్ నుంచి ప్రతిభాక్రమంలో ఎంపిక చేస్తారు. జేఈఈ-మెయిన్ ఫలితాలు వెలువడిన వెంటనే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అమ్మాయిలకు రుసుం మినహాయించారు. అబ్బాయిలకు సంబంధించి జనరల్, ఓబీసీ కేటగిరీ అయితే రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే రూ.1,000, విదేశీ విద్యార్థులైతే 220 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మే 25న ఐఐటీ ప్రవేశ పరీక్ష
Published Wed, Oct 9 2013 12:25 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement