IIT-JEE
-
ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత
మన దగ్గర స్పూర్తిదాయక కథనాలకు కొదవే లేదు. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంత యువత మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు. ఏ ప్రాంతం, ఎంత డబ్బు ఉంది ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మొక్కవోని పట్టుదలతో ఎదిగి తామేంటో నిరూపించుకుంటున్నారు. కలల సాకారం కోసం ఒక్కసారి గట్టి నిశ్చయించు కుంటే.. తమకు ఎదురే ఉండదని నిరూపిస్తున్నారు. బిహార్‌కు చెందిన ఒక రైతు బిడ్డ సక్సెస్ స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తోంది. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని పేద రైతు సిద్ధనాథ్ సింగ్ కుమారుడు సత్యం కుమార్ 13ఏళ్లకే కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-JEE)లో సీటు సాధించి విశేషంగా నిలిచాడు. రైతు బిడ్డ సత్యం 2013లో 679 ర్యాంక్ సాధించాడు. 2010లో IIT సీటు పొందిన ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల సహల్ కౌశిక్ రికార్డును ఛేదించి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును బద్దలు కొట్టాడు. ఐఐటీ పరీక్షకు సంబంధించి కుమార్‌కి ఇది రెండో ప్రయత్నం. 2012లో 12 ఏళ్ళ వయసులోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించాడు. అయితే బెస్ట్ ర్యాంక్ కోసం 12 నెలల తర్వాత మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంలో రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మూడు ప్రాజెక్టులపై పనిచేశాడు. ఎలక్ట్రోక్యులోగ్రామ్ బేస్డ్ ఐ బ్లింక్ క్లాసిఫికేషన్ డ్యూరింగ్ EOG సిగ్నల్ అక్యుయిషన్ టైం, “వివిధ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లలో ఎలక్ట్రోడ్ స్థానాల ఆప్టిమైజేషన్” , “ఇమాజినేటివ్ స్పీచ్ బేస్డ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్” ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. ఇక్కడితో సత్యం కుమార్ విజయ్ ప్రస్థానం ముగిసిపోలేదు. తాజాగా 24 ఏళ్ల వయసులో టెక్ దిగ్గజం యాపిల్ అతణ్ని ఉద్యోగంలోకి తీసుకుంది. 2018లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి B.Tech-M.Tech ఉమ్మడి కోర్స్ పట్టా సాధించాడు సత్యం కుమార్. ప్రస్తుతం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేస్తున్నాడు. 2023 ఆగస్టు వరకు యాపిల్‌లో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పని చేశాడు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ నిపుణుడిగా ఉన్న కుమార్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పలు టెక్నాలజీలను పిల్లలకు బోధించడానికి,వారి జీవితాలను మెరుగుపరచడానికి బిహార్‌లోని తన సొంత జిల్లా భోజ్‌పూర్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పాడు ఎనిమిదో తరగత వరకు స్కూలు అంటే ఏంటో తెలియదు జూలై 20, 1999న జన్మించాడు సత్యం కుమార్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంతటి వాడు కావాలనేది డ్రీమ్. ఇంకో విశేషం ఏమిటంటే అసలు ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌కే వెళ్లలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో, స్థానిక వీర్ కుర్ సింగ్ కాలేజీలో క్లర్క్, మేనమామ పశుపతి సింగ్ సహాయంతో ఇంట్లోనే ప్రాథమిక విద్య పూర్తైంది. 2007లో రాజస్థాన్ బోర్డ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి కోటలోని మోడ్రన్ స్కూల్లో అడ్మిషన్ పొందాడు. అలా ఎనిమిదో తరగతిలో తొలిసారి పాఠశాలకు వెళ్లాడు. చాలా తొందరగా నేర్చుకునే తత్వం అసాధారణమైన జ్ఞాపకశక్తిగల విద్యార్థిగా ప్రశంసలందుకున్నాడు. రాజస్థాన్ బోర్డ్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని పదేళ్లకే పదో తరగతి, 12 సంవత్సరాల వయస్సులో XII తరగతిని క్లియర్ చేయడం విశేషం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ డ్రీమ్ అంతేకాదు తానేమీ పుస్తకాల పురుగును కాదనీ, సినిమాలు చూస్తా.. ఫుట్ బాల్ ఆడుకుంటా.. మొబైల్ చూస్తా..కానీ పూర్తి శ్రద్ధగా ఆరుం గంటలు చదువుకుంటా అని గతంలో తన స్టడీ హ్యాబిట్స్ గురించి తెలిపాడు. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి ఘనతను సాధించాలనేది కల. టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోవాలి...ఫేస్‌బుక్‌కు సమానమైనదాన్ని అభివృద్ధి చేయాలనేది అతని ఆకాంక్ష. -
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. స్టార్టప్‌లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్‌మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్‌కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్‌గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్‌లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్‌లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు అనుమతి
► ప్రవేశాలపై స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు ► 2005 నాటి తీర్పుతో దీన్ని పోల్చలేం ► ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఐఐటీలకు ఆదేశం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమ తినిచ్చింది. ఐఐటీ–జేఈఈ (అడ్వాన్స్)– 2017 ఫలితాల ఆధారంగా నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌పై గతవారం విధించిన స్టేను ఎత్తివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వు లిచ్చింది. అయితే గందరగోళాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియకు సంబం ధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించ వద్దని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎంఎం శంతనగౌడార్ల ధర్మాసనం అన్ని హైకోర్టులకూ సూచించింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు, బోనస్ మార్కుల కేటాయింపు వంటివి పునరావృతం కాకుండా కచ్చితమైన వ్యవస్థ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వాలని ఐఐటీలను ఆదేశించింది. అందుకు తగిన చర్యలు తీసుకొంటామని ఐఐటీల తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ కేసుతో దీన్ని పోల్చలేం... ప్రస్తుత వ్యాజ్యంలో నెగటివ్ మార్కులతో పాటు, 1.56 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడివున్నాయని, కనుక గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం కేసు (2005)లో ఇదే కోర్టు ఇచ్చిన తీర్పును దీనికి అమలు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గురునానక్‌దేవ్ వర్సిటీ కేసు పది వేల మంది విద్యార్థులకు సంబంధించిందని, అందులో తప్పుగా రాసిన జవాబుకు నెగటివ్ మార్కులు లేవని తెలిపింది. బోనస్ మార్కుల కేటాయింపును తప్పు పడుతూ ఐఐటీ ర్యాంకర్ ఐశ్వర్యా అగర్వాల్, ర్యాంకుల జాబితాను రద్దు చేయాలంటూ మరికొంత మంది విద్యార్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. ఇప్పటివరకు దేశంలోని వివిధ ఐఐటీ కాలేజీల్లో 33,307 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది, ఫీజులు సైతం చెల్లించారు. ఈ నెల 19న తరగతులు ప్రారం భం కానున్నాయి. ఈనెల 7న ఐఐటీ– జేఈఈ (అడ్వాన్స్) ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఐఐటీలను ఆదేశించిన∙విషయం తెలిసిందే. -
ఐఐటీ కౌన్సెలింగ్‌పై సుప్రీం స్టే!
న్యూఢిల్లీ: ఐఐటీ–జేఈఈ 2017 (అడ్వాన్స్డ్) ఫలితాల ఆధా రంగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే ఆపాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఈ ఆదే శాలు అమల్లో ఉంటాయంది. కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించరాదని హైకోర్టులకు సూచించింది. ఐఐటీ–జేఈఈ 2017 ర్యాం కుల జాబితా, అభ్యర్థులందరికీ అదనపు మార్కులు కేటాయించడాన్ని సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల్లో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో చెప్పాలని ఆయా రిజిస్ట్రీలను ఆదేశిస్తూ విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది. ఎందరో విద్యార్థులు పరీక్షలు రాశారని, వారందరినీ దృష్టిలో పెట్టుకుని సమస్యకు సరైన పరిష్కారం చూపాలని అడ్వొకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. పిటిష నర్ల న్యాయవాది వికాస్æ వాదిస్తూ.. ‘బోన స్ మార్కులు కేటాయించడం విద్యార్థుల హక్కులను హరించడమే’అన్నారు. స్పందించిన కోర్టు... సదరు ప్రశ్నలకు జవాబులు రాసిన వారికి ‘బోనస్ మార్కులు’ కేటాయించడమొక్కటే దీనికి పరిష్కార మంటూ 2005 నాటి ఓ తీర్పును ప్రస్తావించింది. -
జేఈఈ అభ్యర్థుల ఆధార్ జారీకి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఐఐటీ–జేఈఈ రాయబోయె అభ్యర్థులకు ఆధార్ కార్డులు జారీచేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆధార్ నోడల్ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) అన్ని ప్రాంతీయ రిజిస్ట్రార్లు, నమోదు ఏజెన్సీలను ఆదేశించింది. దరఖాస్తు సమయంలో విద్యార్థులు ఆధార్ వివరాలను తప్పకుండా పొందుపరచాలని సీబీఎస్ఈ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆధార్ నమోదు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ఆధార్ కార్డు పొందడానికి విద్యార్థులు ఎలాంటి రుసములు చెల్లించనక్కర్లేదని యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే తెలిపారు. -
ఐఐటీ-జేఈఈకి ఫ్రీ కోచింగ్!
కోయంబత్తూరు: ఐఐటీ-జేఈఈ ఆశావాహులకు శుభవార్త. ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కేంద్రప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పరీక్షకు సంబంధించిన మెటీరియల్, పాఠ్యాంశాల వీడియోలను ఆన్ లైన్ ద్వారా ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి అందుబాటులో ఉంచనుంది. సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కోర్సుకు సంబంధించిన వివరాలు, మెటీరియల్స్ తదితరాలు అందుబాటులో ఉంచాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం అత్యంత చౌక ధరలకు ల్యాప్ టాప్, ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికిది శుభపరిణామం. సీబీఎస్ఈ, ఐఐటీలకు చెందిన నిపుణులు, కేంద్రీయ విద్యాలయాలకు చెందిన టీచర్లు, కోచింగ్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన నిపుణులతో కూడిన బృందం ఈ మెటీరియల్ ను తయారుచేయనుంది. -
ఆర్మీ సాయంతో విద్యార్థులు విజయకేతనం!
కాశ్మీర్ః ఎప్పుడూ సమస్యలతో సతమతమయ్యే కాశ్మీర్ లోయలో విద్యాకుసుమాలు విరబూశాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆర్మీ ఉచిత కోచింగ్ ఇవ్వడంతో శిక్షణ తీసుకున్న పదిహేనుమంది విద్యార్థుల్లో పదకొండుమంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఓ రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహించడం ద్వారా ఆర్మీ.. సూపర్ 30 స్టూడెంట్స్ ను ఐఐటీ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసుకుంది. వీరిలో కాశ్మీర్ వ్యాలీనుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన పదిహేను మందిలో పదకొండు మంది విద్యార్థులు ఐఐటీ అడ్బాన్స్ పరీక్షకు అర్హత సంపాదించి ప్రత్యేకతను చాటారు. కాశ్మీరీ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్మీ అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీర్ లలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు పంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక పరీక్షను నిర్వహించి, మొత్తం 30 మంది సూపర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత శాస్త్రాల్లో నుభవజ్ఞులైన అధ్యాపకులతో పదకొండు నెలల పాటు వారికి డాగర్ డివిజన్ కు చెందిన చినార్ కార్స్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో అవకాశం కల్పించింది. ఇక్కడ శిక్షణ పొంది, ఎంట్రన్స్ పరీక్ష రాసిన 15 మందిలో 11 మంది అర్హతను సాధించారని... చినార్ కార్స్ ఈ సంవత్సరం నుంచి సూపర్ 30 ప్రోగ్రామ్ ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందని మేజర్ జనరల్ జెఎస్ నైన్ తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన మేజర్... కాశ్మీర్ లోని యువకులంతా తమ ప్రతిభను వెలికి తీసి, చినార్ 9 జవాన్ క్లబ్స్ ద్వారా సరైన ఉద్యోగావకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది హాజరౌతారని, జమ్మూ, కాశ్మీర్ లలో నిర్వహించిన సూపర్ 30 పరీక్ష ద్వారా శిక్షణ తీసుకున్న మొత్తం 15 మంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి, అందులో 11 మంది ఐఐటీ పరీక్షకు అర్హత సాధించారని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తాజా ఫలితాలు ఇప్పుడు కాశ్మీర్ లోని విద్యారంగానికే ఆశను కల్పిస్తున్నాయి. -
ఐఐటీలో శ్రీచైతన్య-నారాయణ విద్యార్థుల ప్రభంజనం
-
మే 25న ఐఐటీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో ఐఐటీలో ప్రవేశించేందుకు నిర్వహించే జేఈఈ(అడ్వాన్స్డ్)-2014 ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది మే 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ-ఖరగ్‌పూర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్దేశించిన జేఈఈ-మెయిన్-2014లో ఉత్తీర్ణులై మెరిట్ జాబితాలో ఉండే లక్షన్నర మంది ప్రతిభావంతులు మాత్రమే ఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. జేఈఈ-మెయిన్ ఉత్తీర్ణుల్లో 50.5 శాతం(75,750) మందిని కామన్ మెరిట్ లిస్ట్ నుంచి, 27 శాతం(40,500) మందిని ఓబీసీ మెరిట్ లిస్ట్ నుంచి, 15 శాతం(22,500) మందిని ఎస్సీ మెరిట్ లిస్ట్ నుంచి, 7.5 శాతం(11,250) మందిని ఎస్టీ మెరిట్ లిస్ట్ నుంచి ప్రతిభాక్రమంలో ఎంపిక చేస్తారు. జేఈఈ-మెయిన్ ఫలితాలు వెలువడిన వెంటనే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అమ్మాయిలకు రుసుం మినహాయించారు. అబ్బాయిలకు సంబంధించి జనరల్, ఓబీసీ కేటగిరీ అయితే రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే రూ.1,000, విదేశీ విద్యార్థులైతే 220 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.