ఆర్మీ సాయంతో విద్యార్థులు విజయకేతనం!
కాశ్మీర్ః ఎప్పుడూ సమస్యలతో సతమతమయ్యే కాశ్మీర్ లోయలో విద్యాకుసుమాలు విరబూశాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆర్మీ ఉచిత కోచింగ్ ఇవ్వడంతో శిక్షణ తీసుకున్న పదిహేనుమంది విద్యార్థుల్లో పదకొండుమంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఓ రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహించడం ద్వారా ఆర్మీ.. సూపర్ 30 స్టూడెంట్స్ ను ఐఐటీ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసుకుంది. వీరిలో కాశ్మీర్ వ్యాలీనుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన పదిహేను మందిలో పదకొండు మంది విద్యార్థులు ఐఐటీ అడ్బాన్స్ పరీక్షకు అర్హత సంపాదించి ప్రత్యేకతను చాటారు.
కాశ్మీరీ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్మీ అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీర్ లలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు పంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక పరీక్షను నిర్వహించి, మొత్తం 30 మంది సూపర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత శాస్త్రాల్లో నుభవజ్ఞులైన అధ్యాపకులతో పదకొండు నెలల పాటు వారికి డాగర్ డివిజన్ కు చెందిన చినార్ కార్స్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో అవకాశం కల్పించింది. ఇక్కడ శిక్షణ పొంది, ఎంట్రన్స్ పరీక్ష రాసిన 15 మందిలో 11 మంది అర్హతను సాధించారని... చినార్ కార్స్ ఈ సంవత్సరం నుంచి సూపర్ 30 ప్రోగ్రామ్ ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందని మేజర్ జనరల్ జెఎస్ నైన్ తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన మేజర్... కాశ్మీర్ లోని యువకులంతా తమ ప్రతిభను వెలికి తీసి, చినార్ 9 జవాన్ క్లబ్స్ ద్వారా సరైన ఉద్యోగావకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు.
జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది హాజరౌతారని, జమ్మూ, కాశ్మీర్ లలో నిర్వహించిన సూపర్ 30 పరీక్ష ద్వారా శిక్షణ తీసుకున్న మొత్తం 15 మంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి, అందులో 11 మంది ఐఐటీ పరీక్షకు అర్హత సాధించారని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తాజా ఫలితాలు ఇప్పుడు కాశ్మీర్ లోని విద్యారంగానికే ఆశను కల్పిస్తున్నాయి.