ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు అనుమతి
► ప్రవేశాలపై స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు
► 2005 నాటి తీర్పుతో దీన్ని పోల్చలేం
► ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఐఐటీలకు ఆదేశం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమ తినిచ్చింది. ఐఐటీ–జేఈఈ (అడ్వాన్స్)– 2017 ఫలితాల ఆధారంగా నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌పై గతవారం విధించిన స్టేను ఎత్తివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వు లిచ్చింది.
అయితే గందరగోళాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియకు సంబం ధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించ వద్దని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎంఎం శంతనగౌడార్‌ల ధర్మాసనం అన్ని హైకోర్టులకూ సూచించింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు, బోనస్ మార్కుల కేటాయింపు వంటివి పునరావృతం కాకుండా కచ్చితమైన వ్యవస్థ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వాలని ఐఐటీలను ఆదేశించింది. అందుకు తగిన చర్యలు తీసుకొంటామని ఐఐటీల తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు హామీ ఇచ్చారు.
ఆ కేసుతో దీన్ని పోల్చలేం...
ప్రస్తుత వ్యాజ్యంలో నెగటివ్ మార్కులతో పాటు, 1.56 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడివున్నాయని, కనుక గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం కేసు (2005)లో ఇదే కోర్టు ఇచ్చిన తీర్పును దీనికి అమలు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గురునానక్‌దేవ్ వర్సిటీ కేసు పది వేల మంది విద్యార్థులకు సంబంధించిందని, అందులో తప్పుగా రాసిన జవాబుకు నెగటివ్ మార్కులు లేవని తెలిపింది.
బోనస్ మార్కుల కేటాయింపును తప్పు పడుతూ ఐఐటీ ర్యాంకర్ ఐశ్వర్యా అగర్వాల్, ర్యాంకుల జాబితాను రద్దు చేయాలంటూ మరికొంత మంది విద్యార్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. ఇప్పటివరకు దేశంలోని వివిధ ఐఐటీ కాలేజీల్లో 33,307 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది, ఫీజులు సైతం చెల్లించారు. ఈ నెల 19న తరగతులు ప్రారం భం కానున్నాయి. ఈనెల 7న ఐఐటీ– జేఈఈ (అడ్వాన్స్) ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఐఐటీలను ఆదేశించిన∙విషయం తెలిసిందే.