JEE-Mains
-
జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రకటన రేపు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు. -
15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో ప్రవేశానికి ఏప్రిల్ 6న నిర్వహించనున్న జేఈఈ-మెయిన్ ప్రవేశ పరీక్షకు నవంబరు 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) ప్రకటించింది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను జేఏబీ శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ- అడ్వాన్స్డ్ ప్రవేశపరీక్షకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, సిలబస్, అర్హతలు వివరిస్తూ జేఈఈ-మెయిన్ తేదీలను కూడా ప్రస్తావించింది. జేఈఈ- అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అభ్యర్థులు జేఈఈ-మెయిన్‌లో తొలి 1.5 లక్షల ర్యాంకర్ల జాబితాలో ఉండాలని, దీనిని రిజర్వేషన్లవారీగా ప్రకటిస్తారని తెలిపింది. 2013, ఆ తరువాత ఇంటర్ ఉత్తీర్ణులైనవారే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని ప్రకటించింది. రెండుసార్లు మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవకాశం ఉందని, అదికూడా రెండు వరుస సంవత్సరాల్లో మాత్రమే రాయొచ్చని తెలిపింది. 2013లో ఉత్తీర్ణులై ఉంటే అప్పటి బోర్డు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. 2013లో ఇంటర్ ఉత్తీర్ణులై ఇంప్రూవ్ మెంట్ రాసేవాళ్లకు 2014 కటాఫ్ వర్తిస్తుందని తెలిపింది. 2012లో లేదా అంతకుముందు ఇంటర్ రాసిన వాళ్లు అనర్హులని పేర్కొంది. అడ్వాన్స్డ్ రాసేందుకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1989న లేదా ఆ తరువాత జన్మించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసేబులిటీస్ (పీడబ్యూడీ) అయితే అక్టోబర్ 1, 1984న లేదా ఆ తరువాత పుట్టిన వాళ్లు అర్హులని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు రాష్ట్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐఐటీ-మద్రాస్ జోన్ పరిధిలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, వరంగల్, ఐఐటీ-ఖరగ్‌పూర్ జోన్ పరిధిలో విశాఖపట్నం నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
ఐఐటీలో 30 శాతం ప్రశ్నలు ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ... ప్రతిష్టాత్మకమైన ఈ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రం నుంచే ఏటా అత్యధిక మంది అర్హత సాధిస్తున్నారు. అయినా ఇప్పటికీ లక్షల మంది విద్యార్థులకు ఐఐటీ అంటే బ్రహ్మ పదార్థమే. రూ. లక్షలు కోచింగ్‌కు వెచ్చించిన వారికే ఐఐటీల్లో సీటు వస్తుందన్న అపోహతో దాని వైపు కన్నెత్తి కూడా చూడని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అయితే, 2013లో ఐఐటీ ప్రవేశ పరీక్ష అయిన ‘జేఈఈ-అడ్వాన్స్డ్’ నిర్వహించిన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. ప్రభుత్వ కళాశాలల్లో చదివే సాధారణ విద్యార్థులు సైతం ఈ పరీక్ష రాయొచ్చనే నమ్మకం కలుగుతుంది. ఐఐటీ ప్రశ్నపత్రం రూపొందించే నిపుణులకు స్పష్టమైన నిబంధన ఉందని, దాని ప్రకారం ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు చక్కగా ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులెవరైనా సమాధానం ఇచ్చేలా ఐఐటీ ప్రవేశ పరీక్షలో 30% ప్రశ్నలు ఉంటాయని ఈ నివేదికలో వివరించింది. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షలో కాఠిన్యత కొంత తగ్గిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులతో బోధన కల్పిస్తున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ-మెయిన్స్, జేఈఈ-అడ్వాన్స్డ్ తదితర ప్రవేశ పరీక్షలపై అవగాహన కల్పించడం లేదు. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలకు దూరంగా ఉండిపోతున్నారు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఇకపై 30% ప్రశ్నలు బోర్డు పరీక్షల్లో వచ్చే సులభ ప్రశ్నలే ఉంటున్నందున విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 126కు పైగా వస్తే సరి: 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షలో కామన్ మెరిట్ లిస్ట్(సీఎంఎల్)లో నిలిచిన అభ్యర్థులు మొత్తం 360 మార్కులకుగాను 332-126 మధ్య సాధించిన వారు ఉన్నారు. అంటే సీఎంఎల్లో కటాఫ్ 126 మార్కులే. తొలి ర్యాంకర్ 332 మార్కులు సాధించగా.. 300 మార్కులకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 23 మంది మాత్రమే. ఇక 250 మార్కులపైన సాధించిన అభ్యర్థులు 326 మంది మాత్రమే కావడం గమనార్హం. ఓబీసీ జాబితాలో తొలి మార్కు 314 కాగా.. కటాఫ్ మార్కు 113గా ఉందని జేఏబీ తెలిపింది. అలాగే ఎస్సీ కేటగిరీలో తొలి మార్కు 279 కాగా.. కటాఫ్ మార్కు 63 అని, ఎస్టీ విభాగంలో తొలి మార్కు 257గా, కటాఫ్ మార్కు 63 అని పేర్కొంది. 30% ప్రశ్నలకు జవాబులు సరిగ్గా రాస్తేనే 120 మార్కులు సాధించవచ్చని, దీక్షతో ప్రయత్నిస్తే ఐఐటీ సీటు అసాధ్యమేమీ కాదని, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులూ ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐఐటీ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ-అడ్వాన్స్డ్ రాయాలంటే ముందుగా జేఈఈ-మెయిన్ పరీక్షలో తొలి 1,50,000 ర్యాంకర్లలో ఒకరిగా నిలవాలి. ఒకవేళ ఐఐటీ సీటు దక్కకపోయినా జేఈఈ-మెయిన్‌లో మంచి ర్యాంకు దక్కితే ఎన్ఐటీల్లో సీటు దక్కవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. -
మే 25న ఐఐటీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో ఐఐటీలో ప్రవేశించేందుకు నిర్వహించే జేఈఈ(అడ్వాన్స్డ్)-2014 ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది మే 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ-ఖరగ్‌పూర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్దేశించిన జేఈఈ-మెయిన్-2014లో ఉత్తీర్ణులై మెరిట్ జాబితాలో ఉండే లక్షన్నర మంది ప్రతిభావంతులు మాత్రమే ఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. జేఈఈ-మెయిన్ ఉత్తీర్ణుల్లో 50.5 శాతం(75,750) మందిని కామన్ మెరిట్ లిస్ట్ నుంచి, 27 శాతం(40,500) మందిని ఓబీసీ మెరిట్ లిస్ట్ నుంచి, 15 శాతం(22,500) మందిని ఎస్సీ మెరిట్ లిస్ట్ నుంచి, 7.5 శాతం(11,250) మందిని ఎస్టీ మెరిట్ లిస్ట్ నుంచి ప్రతిభాక్రమంలో ఎంపిక చేస్తారు. జేఈఈ-మెయిన్ ఫలితాలు వెలువడిన వెంటనే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అమ్మాయిలకు రుసుం మినహాయించారు. అబ్బాయిలకు సంబంధించి జనరల్, ఓబీసీ కేటగిరీ అయితే రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే రూ.1,000, విదేశీ విద్యార్థులైతే 220 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.