‘అక్రమ నిర్మాణాలు సమాజాభివృద్ధికి చేటు... నిబంధనలకు తిలోదకాలిచ్చిననిర్మాణాలు ప్రమాదకరం. ఇవి పర్యావరణానికి ముప్పు కానున్నాయి. వీటిని సహించకూడదు. అమరావతిలో చేపట్టిన ‘ప్రజా వేదిక’తో మొదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాల కూల్చివేత పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో అలజడి మొదలైంది. ఇన్నాళ్లూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో చూసీ చూడనట్టు వదిలేసిన వారిలో కలవరం పట్టుకుంది. అక్రమార్కుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
సాక్షి, కాకినాడ : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’?...నాడు రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే...ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే...తామేమీ తక్కువ కాదన్నట్టుగా ఆ ‘బాబు’ బాటలో అడుగులేసినవారంతా రెచ్చిపోయి అక్రమాలకు తెగబడతారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకుని చెలరేగిపోతారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అక్రమ నిర్మాణాలు చేపట్టి, అందులో కాపురం ఉంటే మిగతా వారు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా టీడీపీ హయాంలో అక్రమ నిర్మాణాలకు తెరదీశారు.
నిబంధనలకు తిలోదకాలిచ్చి, అను మతులు తీసుకోకుండా ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు చేపట్టారు. జిల్లాలోని మున్సిపాల్టీల పరిధిలోనే ప్రస్తుతానికి 2,367 అక్రమ భవనాలు ఉన్నాయి. వీటిన్నింటినీ మున్సిపల్ అధికారులు అధికారికంగా గుర్తించారు. అంటే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే. ఇక, గుర్తించనవి ఎన్నో... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయంతో అక్రమ కట్టడదారుల్లో గుబులు రేగుతోంది.
సీఎం నిర్ణయంతో అలజడి
జిల్లాలో ఒక్క మున్సిపాల్టీల్లోనే 2,367 అక్రమ కట్టడాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారో స్పష్టమవుతోంది. నేతలకు ముడుపులిచ్చి అడ్డగోలుగా ఖాళీ ఉన్న చోట ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టేసిన పరిస్థితులున్నాయి. మేమున్నాం...మీకెందుకు...ఖాళీ స్థలముంటే కట్టేయండని భరోసా ఇచ్చి అక్రమ నిర్మాణాలను పరోక్షంగా ప్రోత్సహించారు. అడ్డుతగిలిన అధికారులపై ఒత్తిడి చేసి, దారికి రాకపోతే బదిలీ చేసి తమ పని కానిచ్చేసిన పరిస్థితులున్నాయి.
తొమ్మిది మున్సిపాల్టీల్లోనూ, మూడు నగర పంచాయతీల్లో 2,367 అక్రమ కట్టడాలు ఉన్నాయంటే జిల్లా వ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయో అవగతం చేసుకోవచ్చు. ఇవి కూడా అధికారికంగా గుర్తించినవి. అంటే ఇవన్నీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే. ఇక, నేతల ఒత్తిళ్లతో గుర్తించనివి ఎన్ని ఉన్నాయో వారికే తెలియాలి. సీఎం జగన్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అడుగులు ఎంత బలంగా పడనున్నాయో వేచి చూడాల్సిందే.
ఆదేశాలు ఇస్తున్నాం
మున్సిపాల్టీ పరిధిలో తమకొచ్చిన నివేదికల ప్రకారం అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. ఎంతటివారినైనా వదిలేది లేదు.
– మధుకుమార్, మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment