సొంతవారికి సంతర్పణ | illegal things to gift pack ghee for Poor people | Sakshi
Sakshi News home page

సొంతవారికి సంతర్పణ

Published Sun, Jan 11 2015 1:48 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

illegal things to gift pack ghee for Poor people

* ఏపీలో ఖజానాకు రూ. 26 కోట్ల కన్నం
* హెరిటేజ్‌కూ చంద్రన్న ‘సంక్రాంతి కానుక’
* పేదలకు ‘గిఫ్ట్ ప్యాక్’ నెయ్యి  కొనుగోళ్లలో అక్రమాలు
* మార్కెట్ కన్నా రూ.200 ఎక్కువకు విక్రయం
* విశాఖ డెయిరీ నెయ్యి కిలో ధర రూ. 320 మాత్రమే..
* భారీగా కొనుగోలు చేస్తే ధర మరింత తగ్గించే అవకాశం
* కానీ.. సహకార డెయిరీలు, ఇతర డెయిరీల జోలికి వెళ్లని సర్కారు
* టెండర్లు కూడా పిలవని వైనం
* హెరిటేజ్ కిలో నెయ్యి ధరనే ప్రామాణికంగా తీసుకొనేలా చక్రం తిప్పిన నాయకులు
* నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేలా డిపాజిట్లూ తీసుకోలేదు.. పైగా అడ్వాన్సు చెల్లింపులు

 
నెయ్యి సరఫరా చేసే సంస్థ నుంచి నిబంధనల ప్రకారమైతే మొత్తం విలువలో 5 శాతం ముందస్తు డిపాజిట్ తీసుకోవాలి. నాణ్యత లోపించినా, ప్రమాణాలు పాటించకున్నా డిపాజిట్ నుంచి ఈ సొమ్ము మినహాయించుకునే అవకాశం ఉంటుంది. చంద్రన్న కానుక నెయ్యి సరఫరాలో ప్రభుత్వం డిపాజిట్ నిబంధనకు నీళ్లొదిలింది. సదరు సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి మరీ నెయ్యి సరఫరా చేయాలని కోరింది. అంటే నెయ్యిలో నాణ్యత లోపించినా, తూకం తగ్గినా ప్రభుత్వం తప్పని సరిగా తీసుకోవాలే తప్ప చేయగలిగేదేం ఉండదు. గోధుమ పిండి, కందిపప్పు కొనుగోలులోనూ రూ.కోట్ల సంతర్పణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్: విశాఖ డెయిరీకి చెందిన గేదె నెయ్యి కిలో ప్యాకెట్‌ను రూ. 320 ధరకు మార్కెట్‌లో రిటైల్‌గా విక్రయిస్తున్నారు. వెయ్యి కిలోల నెయ్యి ఏకమొత్తంగా కొంటే.. అదీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే.. ఈ ధర మరింత తగ్గుతుందనేది నిర్వివాదాంశం. పోనీ ఇతర డెయిరీల ధరలు చూసినా.. గరిష్టంగా రూ. 375 ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు చాలా డెయిరీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకగా రేషన్ కార్డుదారులకు అందించే నెయ్యిని మాత్రం కిలోకి ఏకంగా రూ. 200 అధికంగా చెల్లిస్తూ రూ. 575 (వ్యాట్‌తో కలిపి) ధర చెల్లించింది.
 
 అదికూడా.. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరి టేజ్ సహా.. అస్మదీయులకు చెందిన పలు సంస్థల నుంచి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేసింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందంటున్న సర్కారు పెద్దలు.. సహకా ర డెయిరీలు విక్రయించే ధరకన్నా చాలా అధికంగా చెల్లిస్తూ.. నెయ్యి కొనుగోలులోనే రూ. 26 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని సంతర్పణ చేయటం విస్తుగొలుపుతోంది. నిబంధనల ప్రకారం మార్కెట్‌లో తక్కువ ధరకు సరఫరా చేసి వారి నుంచి టెండర్లు ఆహ్వానించి కొనుగోళ్లు చేయాల్సి ఉండగా.. అటువంటివేమీ లేకుండా అత్యవసర కొనుగోళ్ల పేరుతో అస్మదీయులకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించి రూ.కోట్లను దారపోశారని అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 మార్కెట్ ధరలు రూ.320 నుంచి మొదలు
 సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక కింద పేదలకు ఉచితంగా అందించే ‘గిఫ్ట్ ప్యాక్’లో మిగిలిన సరుకులతో పాటు ఒక కార్డుకు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 1,301 కిలో లీటర్ల నె య్యి కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోను, పొరుగు రాష్ట్రాల్లోను అనేక డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్‌తో సహా రూ. 320 నుంచి రూ. 420 వరకు విక్రయిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320 ధరకు, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ. 420 ధర చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి.
 
 సంక్రాంతి పండుగ సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ. 372 ధరకు విక్రయిస్తామని బెజవాడలోని ఒక సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. వందల కిలోలు కొంటే ఈ ధర మరింత తగ్గించేందుకు సరేనంటోంది. ఇవన్నీ పరిశీలించి.. బహిరంగ టెండర్లు పిలవడం ద్వారా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వచ్చే సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు అప్పగించాల్సి ఉంటుంది.
 
 సహకార డెయిరీలను సంప్రదించకుండానే...
 చంద్రన్న కానుకలో భాగంగా 1,301 టన్నుల నెయ్యి కొనుగోలు కోసం సహకార రంగంలోని విశాఖ డెయిరీ, విజయ డెయిరీలతో ప్రభుత్వం బేరసారాలు జరిపినట్లయితే.. అవి మార్కెట్‌లో విక్రయించే ధరకన్నా మరింత తక్కువ ధరకే అంటే కిలో నెయ్యి రూ. 300 ధరకు సరఫరా చేసే అవకాశం ఉండేది. ధర తగ్గించకపోయినా విశాఖ డెయిరీ వాస్తవ ధరకుకొనుగోలు చేసినా.. రూ. 33 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యేది. పోనీ తిరుమల డెయిరీ ధరకు కిలో రూ. 375 చొప్పున కొనుగోలు చేసినా.. రూ. 26 కోట్లు వృథా అయ్యేవి కాదు. వేయి టన్నులకు పైగా నెయ్యి కొనుగోలు కోసం బహిరంగ టెండర్లు నిర్వహించి పోటీ పెడితే కిలో నెయ్యి పన్నులతో కలిపి రూ. 350 ధరకే లభించే అవకాశం వుంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద నేత ఒత్తిడితో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పద్ధతి ప్రకారం నెయ్యి సేకరణ జరపలేకపోయారని చెప్తున్నారు.
 
 హెరిటేజ్ డెయిరీ ధరే ప్రామాణికంగా...
 మార్కెట్‌లో చంద్రబాబు కుటుంబానికి చెంది న హెరిటేజ్ సంస్థ మాత్రం కిలో నెయ్యిని రూ. 499 ధరకు వినియోగదారులకు విక్రయిస్తోం ది. ఈ కారణంగానే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి హెరిటేజ్ తరఫున, తమ సంస్థల తరఫున చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. నెయ్యి సరఫరాకు మిగిలిన డెయిరీలేవీ ముం దుకు రాకుండా అధికార పార్టీ ముఖ్య నేత తెరవెనుక వ్యవహారం నడిపారని తెలిసింది. ఇలా నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు లేకుండా చేసి.. హెరిటేజ్ నిర్ణయించిన ధరనే ఖరారు చేయించి తమకు, తమకు కావాల్సిన వారికీ ప్రయోజనం కలిగేలా కిలో నెయ్యి రూ. 499 ధరతో పాటు దీని మీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ. 575 చొప్పున కొనుగోలు చేయించే ఎత్తుగడ అమలు చేశారని సమాచారం.
 
  ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అస్మదీయులకు అయాచిత లబ్ధిచేకూర్చటమే లక్ష్యంగా.. హెరిటేజ్ ధరనే ప్రామాణికంగా నిర్ణయించి ఆ సంస్థతో పాటు, టీడీపీ నేతలు, వారి సన్నిహితులకు చెందిన మరికొన్ని ఇతర సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించారని చెప్తున్నారు. అత్యవసరం పేరు తో జరిపిన ఈ లావాదేవీ వల్ల ఒక్క నెయ్యి సరఫరాలోనే కిలోకు రూ. 200 చొప్పున 1,301 కిలో లీటర్ల కొనుగోళ్లలో రూ. 26 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వం అదనంగా చెల్లించే రూ. 26 కోట్లలో నీకింత నాకింత అనే ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
 
అయిన వారికే నెయ్యి కాంట్రాక్టులు...
 హెరిటేజ్ సంస్థ నిర్ణయించిన మేరకు కిలో నెయ్యి రూ. 499 లెక్కన నెయ్యి కొనుగోలు చేయడానికి నిర్ణయించిన సర్కారు తమకు కావాల్సిన సంస్థలు, టీడీపీ నేతల బినామీలకు ఇదే ధర చెల్లించేలా చక్రం తిప్పారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు కడప జిల్లాలో 70 కిలో లీటర్ల నెయ్యి సరఫరాను అప్పగించింది.
 
 ఇందుకోసం ఆ సంస్థకు రూ. 3,49,30,000 చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీలోని ఒక ముఖ్య నేత కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలున్న కేంద్రీయ భాండార్ సంస్థకు శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 545 కిలో లీటర్ల నె య్యి సరఫరాకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ. 27,19,55,000 చెల్లించనున్నట్లు పేర్కొంది. సంగం డెయిరీకి గుంటూరు జిల్లాలో కొంత భాగానికి 116 కిలో లీటర్ల సరఫరాకు గాను 5,78,84,000 రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
 
  గుడ్‌లైఫ్ ఎంటర్ ప్రజైస్ సంస్థ విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంత భాగానికి 503.063 కిలో లీటర్ల నెయ్యి సరఫరా బాధ్యత ఇచ్చింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ. 25,10,28,437 చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరుకు చెందిన శ్రీ చక్ర మిల్క్ ప్రాడక్ట్ సంస్థకు విజయనగరం జిల్లాలో 67 కిలో లీటర్ల సరఫరాకు రూ. 3,34,33,000 చెల్లించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కొనుగోలు వ్యవహారంలోనే పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారికి, ప్రభుత్వంలో కీలకమైన ఒక నేతకు మధ్య వార్ నడిచినట్లు సంబంధిత శాఖలోని కింది స్థాయి సిబ్బంది చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement