మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌వో) వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకు మేళాను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నగదు బదిలీ(డీబీటీ) పథకం ప్రగతిపై ప్రతి శుక్రవారం కలెక్టర్ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఖాతాలు లేని వారిని గుర్తించి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతోపాటు ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో బ్యాంకు మేళాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్ వినియోగదారులు 80,830 మంది ఉండగా నగదు బదిలీలో భాగంగా రూ.4.47 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. గ్యాస్ వినియోగదారుడికి మొదటి విడతగా రూ.435, రెండో విడతగా రెండ్రోజుల అనంతరం రూ.118తో కలిపి మొత్తంగా రూ.553 బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వివరించారు.
జిల్లాలో 4.15లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా నగదు బదిలీ పథకంపై ఆధార్ నమోదుతో 3.82లక్షల వినియోగదారులు పరిగణనలోకి వచ్చారని తెలిపారు. ఇందులో 1.50 లక్షల దీపం పథకం వినియోగదారులు ఉన్నారని, సర్వే సాగుతోందని, ఆధార్, రేషన్‌కార్డు అనుసంధానం 80 శాతం వరకు పూర్తయిందని పేర్కొన్నారు. మంచిర్యాల మండలం గుడిపేటలో ఇటీవల ఇళ్లు కాలిపోగా వారిలో 39 మంది అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. బంగారుతల్లి పథకానికి రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో వచ్చే రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి కార్డులు అందేలా చూస్తామన్నారు. కుటుంబంలో పెళ్లయిన వారు రేషన్‌కార్డు పాత జిరాక్స్ కాపీని అందజేస్తే అందులో వారి ఫొటోను తొలగించి ఆ జంటకు మరో రేషన్‌కార్డు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న, ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పకడ్బందీగా నగదు బదిలీ పథకం అమలు
Published Thu, Oct 3 2013 4:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement