dso
-
అధికారి ఓవరాక్షన్.. అన్నీ నేనే.. అంతా నేనే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయంలో ఓ సహాయ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అని అతను చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ఆ శాఖలో ఆయన పెత్తనం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. చెప్పాలంటే డీఎస్ఓ కార్యాలయంలో అంతా ఆయన అజమాయిషీయే కొనసాగుతున్నది. ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులు పెట్టడం, ఆ ఫిర్యాదులతో బ్లాక్మెయిల్ చేయడం, అధికారులు సైతం ఆయన చెప్పినట్టే నడుచుకుంటారని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పడాయనపైనే జాయింట్ కలెక్టర్‌కు, కలెక్టర్‌కు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారని మొరపెట్టుకోవడమే కాకుండా ఆయన గారి లీలలన్నీ సదరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ జె. నివాస్ ఆయనపై విచారణకు ఆదేశించారు. సస్పెండైన ఒక సీఎస్ డీటీకి మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేలు లాగేశారు. నేరుగా తన బ్యాంకు ఖాతాలోనైతేఇబ్బందులొస్తాయని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలో ఆ సొమ్ము వేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఆ ఉద్యోగికి న్యాయం చేయలేదు. సాధారణంగా సస్పెన్షన్ పునరుద్ధరణ విషయంతో ఆ అధికారికి సంబంధం లేదు. శాఖాపరమైన నిబంధనల మేరకు జేసీ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేసి ఎలాగూ విధులకు అనుమతిస్తారని తెలుసుకుని తానే అంతా చేస్తానన్నట్టుగా బిల్డప్ ఇచ్చి రూ.50 వేలు పిండేశారన్న వాదనలు ఉన్నాయి. మచ్చుకు ఇదొకటి. ఇలాంటివి అనేకం ఉన్నాయని అక్కడి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. తనకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసని పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పి డీఎస్ఓ కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఇంకొక విషయమేమిటంటే తానే ఫేక్ ఫిర్యాదులు పెట్టి, ఆ ఫిర్యాదులు చూపించి ఉద్యోగులను బెదిరించడం పరిపాటిగా మారింది. చేసేవి తప్పులు.. ఆపై ఎదురుదాడి ఆ సహాయ అధికారికి ఉన్న అహం అంతా ఇంతా కాదు. తప్పులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తారు. ప్రజాప్రతినిధులను సైతం పట్టించుకోవడం లేదు. వారెంత నా ముందు అన్నట్టుగా ఓవరాక్షన్ చేస్తారు. తాజాగా మిల్లులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల అడ్డగోలు ట్యాగింగ్‌పై ఇదే రకంగా వ్యవహరించారు. పోలాకి మండలం ఈదులవలస కొనుగోలు కేంద్రాన్ని గాలికొదిలేసి రాళ్లపాడుకు చెందిన మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగ్ చేయడంపై పెద్ద వివాదమే నడుస్తోంది. మిల్లరు, డీఎస్ఓ కార్యాలయం ఉద్యోగులు కొందరు కుమ్మక్కై చేసిన అడ్డగోలు భాగోతంపై విచారణ కూడా జరిగింది. దీనిపై రైతులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాసారు. రైతులకు అన్యాయం చేసిన వారిని వదలకూడదని లేఖలో తెలిపారు. చినికి చినికి గాలివానగా మారినట్టు అడ్డగోలు ట్యాగింగ్ వివాదం పెద్దది కావడంతో అధికారులు సైతం ఒక ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు ఫైలు పెట్టారు. అయితే ఆ ఉద్యోగిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఈయన గారు ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన బాగోతమే. మహిళా ఉద్యోగికి బెదిరింపు డీఎస్ఓ కార్యాలయంలో జరుగుతున్న అడ్డగోలు బాగోతమంతా బయటికి వెల్లడిస్తున్నారని చెప్పి శారద అనే మహిళా ఉద్యోగిపై కక్ష సాధింపునకు దిగారు. ఆమెను ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా... తానేంటో చూపిస్తానని, తనకు పలుకుబడి ఉందని, వదిలేని లేదని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఫేక్ ఫిర్యాదులను చూపించి భయపెట్టారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి ఆందోళనకు గురై, తీవ్ర మనస్తాపం చెంది జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. డీఎస్ఓ కార్యాలయంలో జరుగుతున్న తంతు, ఆయన వ్యవహార శైలి, లీలలను ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాస్తవమేంటో తెలుసుకుని కలెక్టర్ జె.నివాస్ విచారణకు ఆదేశించారు. మహిళ ఫిర్యాదు చేసిన అధికారిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని కలెక్టర్ జె.నివాస్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమకు మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణకు ఆదేశించామని, ఇరువురి వాదనలు విన్నాక ఏది వాస్తవమో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
డీఎస్‌ఓగా శివరాంప్రసాద్
అనంతపురం అర్బన్ : జిల్లా సరఫరాల అధికారిగా (డీఎస్ఓ) శివరాంప్రసాద్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖలో అసిస్టెంట్ గ్రై¯ŒS పర్చేజ్ అధికారిగా ఉంటున్న శివరాంప్రసాద్కి డీఎస్‌ఓగా పదోన్నతి కల్పిస్తూ జిల్లాకు బదిలీ చేసింది. ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టవచ్చని డీఎస్ఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక్కడ డీఎస్ఓ విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రావు ఈ ఏడాది జనవరి 31న ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డి.శివశంకర్‌రెడ్డి ఇ¯ŒSచార్జి డీఎస్‌ఓగా వ్యవహరిస్తున్నారు. -
కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్
మచిలీపట్నం(చిలకలపూడి): కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా డీఎస్వో వి.రవికిరణ్‌ను నియమిస్తూ సోమవారం కలెక్టర్ బాబు.ఎ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా పనిచేసిన జిల్లా క్రీడలశాఖ అధికారి బదిలీ కావటంతో ఖాళీ ఏర్పడింది. డీఎస్వోను మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించాలని సోమవారం మీకోసం కార్యక్రమంలో సూచించారు. ప్రత్యేకాధికారిగా కంకిపాడు మండలంలో గ్రామాలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, కనీసం పది గ్రామాలైన ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
క్రీడోదయం
ఫలితాన్నిచ్చిన టాలెంట్ హంట్ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ తొలిసారిగా జిల్లా నుంచి 25మంది ఎంపిక స్పోర్ట్స్ స్కూళ్లతో క్రీడాకారులకు మహర్దశ జిల్లా స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ హంట్ మంచి ఫలితానిచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన చిన్నారి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది స్పోర్ట్స్ స్కూల్‌కు జిల్లా నుంచి పది కంటే తక్కువగానే ఎంపికయ్యేవారు. కానీ ఈ సారి ఏకంగా 25మంది చిన్నారులు ఎంపికయ్యారు. – మహబూబ్‌నగర్ క్రీడలు జిల్లా గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో సత్తాచాటారు. ఈ ఏడాది తొలిసారిగా 25మంది పాలమూరు విద్యార్థులు రాష్ట్రంలోని హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలకు ఎంపికై సంచలనం సృష్టించారు. 25 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి 4, 5 తరగతుల్లో ప్రవేశం పొందారు. వీరిలో 15మంది విద్యార్థులు ఆదిలాబాద్ స్కూల్‌కు ఎంపికయ్యారు. 20మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందారు. వీరికి ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో చదువుతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. మూడేళ్ల పాటు ఫెక్సిబిలిటీ కింద శిక్షణ అందజేసి అనంతరం వారు ఎంచుకున్న క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ఫలించిన టాలెంట్‌హంట్.. కలెక్టర్ టీకే శ్రీదేవి సహకారంతో తెలంగాణలో ఎక్కడాలేని విధంగా డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లో ఒక తండాను ఎంపిక చేసుకుని ప్రత్యేకంగా టాలెంట్ హంట్‌ను నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో టాలెంట్ హంట్‌తో క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను వెలికితీశారు. వీరికి ముందుగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో నిర్వహించే ఎత్తు, బరువు, మెడిసిన్ బాల్ త్రో, షటిల్ రన్, 30 మీటర్ల రన్, షార్ట్ జంపింగ్ తదితర అంశాల్లో ఎంపికలు నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. స్పోర్ట్స్ స్కూల్ (ఆదిలాబాద్) 4వ తరగతిలో.. మహేశ్వరి (ఖిల్లాఘనపురం), భానుప్రియ (పదర), సింధు (నర్సాయిపల్లి), సవిత (లింగంపల్లి), మోనేశ్వరి (కొల్లంపల్లి), వినోద్ (లింగంపల్లి), నిఖిల్‌గౌడ్ (ముట్పూర్), రాంచరణ్ (బిజినేపల్లి), 5వ తరగతిలో.. పావని (ఉప్పునుంతల), బాలమణి (లింగంపల్లితండా). శ్రీధర్ (టంకర), గోవర్ధన్ (బెక్కం), సాయివరుణ్ (మహబూబ్‌నగర్), భానుప్రకాశ్‌గౌడ్ (కొండూర్), తరుణ్‌కుమార్‌రెడ్డి (ఖిల్లాఘనపురం). స్పోర్ట్స్ స్కూల్ (హైదరాబాద్) 4వ తరగతిలో.. జయ (కొల్లంపల్లి), అరుణశ్రీ (మద్దూర్), హిమబిందు (మానాజిపేట), అర్చన (బొల్గట్‌పల్లి), సహస్ర (బాలానగర్). 5వ తరగతిలో.. రాము (వెల్కిచర్ల). రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ (కరీంనగర్) 4వ తరగతిలో.. సుప్రజ (చిన్నచింతకుంట), ముడావత్ అనూష (తాడూర్), రాకేశ్ (పెనిమిళ్ల), శివమణి (బాలానగర్). స్పోర్ట్హాస్టల్ ద్వారా రాణించిన జిల్లా క్రీడాకారులు స్పోర్ట్ హాస్టల్లో ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. జిల్లాకు చెందిన అథ్లెట్ శంకర్ జిల్లాస్థాయి నుంచి హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఖిల్లాఘనపూర్కు చెందిన నవత సెపక్‌తక్రాలో ఏషియన్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. వీరితో పాటు భారతి, లలిత, అంజలి, సరిత, పాండు, స్వప్న, నరేశ్, హారిక, రామునాయక్, రాములు, గోపాల్, లక్ష్మిరాం స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ ఆయా క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. 50మంది ఎంపికయ్యేలా లక్ష్యం.. – సత్యవాణి, డీఎస్డీఓ జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం ఉంది. దానిని వెలికితీస్తే మంచి క్రీడా ఆణిముత్యాలు వస్తారు. కలెక్టర్ సహకారంతో టాలెంట్ హంట్‌ను నిర్వహించాం. మూడు స్పోర్ట్స్ స్కూళ్లలకు 25 మంది క్రీడాకారులు ఎంపికకావడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టాలెంట్ హంట్లు నిర్వహించి 50మంది ఎంపికయ్యేలా లక్ష్యంగా శిక్షణ అందజేస్తాం. -
50వేల మొక్కలు నాటాలి
l డీఎస్ఓ సంధ్యారాణి కురవి : పౌర సరఫరాల శాఖ, రేషన్‌డీలర్లు 50 వేల మొక్కలను నాటే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారిణి (డీఎస్ఓ) సంధ్యారాణి అన్నారు. గు రువారం మండల కేంద్రం లోని వీరభద్రస్వామి క ల్యాణమండపం వద్ద ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని తెలిపారు. అడవులు నరికివేయడంతోనే కరవు కాటకాలు వస్తున్నాయని, అందుకోసం మొక్కలు నాటి అడవులను పెంచాలన్నారు. రేషన్‌డీలర్లు మొక్క లు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, సంఘం డివిజన్ అధ్యక్షుడు పెనుగొండ వీరభద్రప్రసాదరావు, డిప్యూటీ తహసీల్దార్ శేషగిరిస్వామి, ఆర్ఐ ఫిరోజ్, డీలర్లు మలిశెట్టి సత్యనారాయణ, బీవీ ప్రసాద్, శ్రీనివాస్, ఆలయ సిబ్బంది బాదె వెంకన్న, సమ్మయ్య పాల్గొన్నారు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
డీఎస్ఓ ఎవరు ?
విజయనగరం కంటోన్మెంట్ : ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థంగా నడిపించాల్సిన పౌరసరఫరాల శాఖ కార్యాలయూనికి నాథుడు ఎవరో తెలియక ఇబ్బందులెదురవుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కానుకలు, ధాన్యం మిల్లుల కేటాయింపు, కొత్త పీపీసీ కేంద్రాల మంజూరు, తదితర కీలకమైన పనులున్న సమయంలో పౌరసరఫరాల శాఖాధికారి ఎవరన్న విషయంలో నాటకీయ పరిణామాలు నడుస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కె. నిర్మలాబాయికి విశాఖపట్నం అర్బన్ డీఎస్‌ఓగా బదిలీ జరిగినా సుమారు నాలుగు నెలల పాటు ఆమె ఇక్కడే విధులు నిర్వహించారు. అయితే తెలంగాణ పోస్టుల సర్దుబాటులో భాగంగా ఎన్. జ్వాలా ప్రకాష్ ఇక్కడకు బదిలీపై వచ్చారు. దీంతో రెండు నెలల కిందట ఆమె విశాఖకు వెళ్లిపోయూరు. ఇదిలా ఉంటే జ్వాలా ప్రకాష్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. గణపతిరావును ఇన్చార్జి డీఎస్‌ఓగా కలెక్టర్ నాయక్ బాధ్యతలు అప్పగించారు. అరుుతే ఇంతలో ఏమైందో కాని డీఎస్ఓ కార్యాలయంలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావును ఇన్చార్జి డీఎస్‌ఓగా నియమిస్తూ పది రోజుల కిందట సంబంధిత కమిషనరేట్ నుంచి ఆన్లైన్లో ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం సంబంధిత ఫైళ్లపై అటు గణపతిరావు కాని ఇటు నాగేశ్వరరావు కాని ఎవ్వరూ సంతకాలు చేయడం లేదు. కలెక్టర్ నుంచి ఆమోద ముద్ర రాని కారణంగా నాగేశ్వరరావు సంతకాలు చేయడం లేదు. గణపతిరావుకు కలెక్టరే బాధ్యతలు అప్పగించినా కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు రాని కారణంగా ఆయన కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అధికారులు, సిబ్బంది జీతాల ఫైళ్లు కూడా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. కనీసం పండుగ పూటైనా జీతాలు అందుతాయో, లేదోనని సిబ్బంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై డీఎం గణపతిరావు వద్ద ప్రస్తావించగా, కలెక్టర్ గారు తనను ఇన్చార్జి డీఎస్‌ఓగా నియమించినా, సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఏఎస్ఓ నాగేశ్వరరావుకు ఉత్వర్వులు రావడం వల్ల ఏమి చేయూలో తెలియడం లేదన్నారు. -
మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
పాలకొండ: తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేసే క్రమంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) సిహెచ్.ఆనంద్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన పాలకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో ఆధార్ నమోదు 80 శాతం పూర్తయిందని, ఈ నెల 15లోగా శతశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజాం జీఎంఆర్ కళాశాలలో ఫీడింగ్ ప్రక్రియ శరవేగంతో కొనసాగుతోందన్నారు. వంగర, పొందూరు మండలాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన పాలకొండ మండలంలో తూకాల్లో తేడావస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆరా తీశారు. తహశీల్దార్ కె.రామకృష్ణ, సీఎస్ డీటీ సరోజిని నుంచి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలేకుండా తరచూ తనిఖీలు చేయాలన్నారు. -
పక్కదారి పడుతున్న రేషన్ కిరోసిన్
వీరఘట్టం, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు రేషన్ డిపోల ద్వారా రాయితీపై అందించాల్సిన నీలి కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిరోసిన్‌ను డీలర్లు కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసి, మిగిలిన దాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. ముం దుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్టాకు రాగానే అక్రమ వ్యాపారులతో లాలూచీ పడుతున్నారు. కిరోసిన్ అందని లబ్ధిదారులు దీనిపై ప్రశ్నిస్తే లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. సకాలంలో వచ్చి తీసుకోకపోతే తామేం చేస్తామంటూ తిరగబడుతున్నారు. అంతేకాకుండా రెండు నెలలకు ఒకసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. వేసవి, విద్యుత్ కోతలతో పెరిగిన డిమాండ్ అసలే వేసవి కాలం.. పైగా వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా కిరోసిన్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామీణులు చాలామంది కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. కొందరు వంట కోసం కూడా కిరోసిన్‌నే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితి అటు రేషన్ డీలర్లకు, ఇటు అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. కిరోసిన్ లోడ్ వ స్తోందని తెలిసిన వెంటనే అక్రమ వ్యాపారులు డీలర్ల వద్ద వాలిపోతున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 1987 రేషన్ డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో మొత్తం 7,77,875 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,81,940 తెలుపు రేషన్‌కార్డులు కాగా, రచ్చబండ-2లో ఇచ్చిన కార్డులు 41,892, ఏఏవై కార్డులు 52,722, ఏపీ కార్డులు 1321 ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 1,320 కిలోలీటర్ల కిరోసిన్ విడుదల చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన కార్డుదారునికి నెలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ అందజేయాలి. అయితే డీలర్లు అలా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు లీటరు చొప్పున, మరికొందరు లీటరున్నర చొప్పున ఇస్తున్నారు. ఇదేంటని కార్డుదారులు ప్రశ్నిస్తే ఇంతే వచ్చింది ఏంచేయమంటారని దబాయిస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరుకులను డీలర్లకు చేర్చేందుకు రూట్ అధికారులను నియమించారు. వీరితో డీలర్లు అవగాహన కుదుర్చుకుని కిరోసిన్నురాత్రి వేళ తరలిస్త్తున్నారు. దీంతో కిరోసిన్ తరలింపుపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. మరో వైపు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినపుడు కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించుకుని జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు వస్తే చర్యలు: డీఎస్వో ఆనందకుమార్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందకుమార్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా కిరోసిన్ పంపిణీపై ఇప్పటి వరకు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఫిర్యాదులేమైనా వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కిరోసిన్ సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
పకడ్బందీగా నగదు బదిలీ పథకం అమలు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకు మేళాను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నగదు బదిలీ(డీబీటీ) పథకం ప్రగతిపై ప్రతి శుక్రవారం కలెక్టర్ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఖాతాలు లేని వారిని గుర్తించి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతోపాటు ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో బ్యాంకు మేళాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్ వినియోగదారులు 80,830 మంది ఉండగా నగదు బదిలీలో భాగంగా రూ.4.47 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. గ్యాస్ వినియోగదారుడికి మొదటి విడతగా రూ.435, రెండో విడతగా రెండ్రోజుల అనంతరం రూ.118తో కలిపి మొత్తంగా రూ.553 బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వివరించారు. జిల్లాలో 4.15లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా నగదు బదిలీ పథకంపై ఆధార్ నమోదుతో 3.82లక్షల వినియోగదారులు పరిగణనలోకి వచ్చారని తెలిపారు. ఇందులో 1.50 లక్షల దీపం పథకం వినియోగదారులు ఉన్నారని, సర్వే సాగుతోందని, ఆధార్, రేషన్‌కార్డు అనుసంధానం 80 శాతం వరకు పూర్తయిందని పేర్కొన్నారు. మంచిర్యాల మండలం గుడిపేటలో ఇటీవల ఇళ్లు కాలిపోగా వారిలో 39 మంది అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. బంగారుతల్లి పథకానికి రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో వచ్చే రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి కార్డులు అందేలా చూస్తామన్నారు. కుటుంబంలో పెళ్లయిన వారు రేషన్‌కార్డు పాత జిరాక్స్ కాపీని అందజేస్తే అందులో వారి ఫొటోను తొలగించి ఆ జంటకు మరో రేషన్‌కార్డు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న, ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.