ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థంగా నడిపించాల్సిన పౌరసరఫరాల శాఖ కార్యాలయూనికి నాథుడు ఎవరో తెలియక ఇబ్బందులెదురవుతున్నాయి.
విజయనగరం కంటోన్మెంట్ : ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థంగా నడిపించాల్సిన పౌరసరఫరాల శాఖ కార్యాలయూనికి నాథుడు ఎవరో తెలియక ఇబ్బందులెదురవుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కానుకలు, ధాన్యం మిల్లుల కేటాయింపు, కొత్త పీపీసీ కేంద్రాల మంజూరు, తదితర కీలకమైన పనులున్న సమయంలో పౌరసరఫరాల శాఖాధికారి ఎవరన్న విషయంలో నాటకీయ పరిణామాలు నడుస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కె. నిర్మలాబాయికి విశాఖపట్నం అర్బన్ డీఎస్‌ఓగా బదిలీ జరిగినా సుమారు నాలుగు నెలల పాటు ఆమె ఇక్కడే విధులు నిర్వహించారు. అయితే తెలంగాణ పోస్టుల సర్దుబాటులో భాగంగా ఎన్. జ్వాలా ప్రకాష్ ఇక్కడకు బదిలీపై వచ్చారు.
దీంతో రెండు నెలల కిందట ఆమె విశాఖకు వెళ్లిపోయూరు. ఇదిలా ఉంటే జ్వాలా ప్రకాష్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. గణపతిరావును ఇన్‌చార్జి డీఎస్‌ఓగా కలెక్టర్ నాయక్ బాధ్యతలు అప్పగించారు. అరుుతే ఇంతలో ఏమైందో కాని డీఎస్‌ఓ కార్యాలయంలో ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావును ఇన్‌చార్జి డీఎస్‌ఓగా నియమిస్తూ పది రోజుల కిందట సంబంధిత కమిషనరేట్ నుంచి ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం సంబంధిత ఫైళ్లపై అటు గణపతిరావు కాని ఇటు నాగేశ్వరరావు కాని ఎవ్వరూ సంతకాలు చేయడం లేదు.
కలెక్టర్ నుంచి ఆమోద ముద్ర రాని కారణంగా నాగేశ్వరరావు సంతకాలు చేయడం లేదు. గణపతిరావుకు కలెక్టరే బాధ్యతలు అప్పగించినా కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు రాని కారణంగా ఆయన కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అధికారులు, సిబ్బంది జీతాల ఫైళ్లు కూడా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. కనీసం పండుగ పూటైనా జీతాలు అందుతాయో, లేదోనని సిబ్బంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై డీఎం గణపతిరావు వద్ద ప్రస్తావించగా, కలెక్టర్ గారు తనను ఇన్‌చార్జి డీఎస్‌ఓగా నియమించినా, సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఏఎస్‌ఓ నాగేశ్వరరావుకు ఉత్వర్వులు రావడం వల్ల ఏమి చేయూలో తెలియడం లేదన్నారు.