దున్నేవాడిదే భూమి
- ప్రతి నిరుపేదకూ నాలుగెకరాలు ఇవ్వాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
- చింతకుంట సమీపంలో భూపోరాటం
పుట్లూరు : దున్నేవాడిదే భూమి అని, భూమిలేని ప్రతి నిరుపేదకూ నాలుగు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పుట్లూరు మండలంలోని చింతకుంట గ్రామం వద్ద సీపీఐ నాయకులు బుధవారం భూ పోరాటంలో భాగంగా విత్తనం వేసే పనులు చేపట్టారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు వేల ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం నిరుపేదలకు ఎకరా కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుని జీవిస్తారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు భూమి పంపిణీ చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతకుంట వద్ద 200 ఎకరాలు, కడవకల్లులో 212 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని అర్హులైన భూమిలేని నిరుపేదలకు ఇచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో దున్నటం, విత్తన పనులు చేపట్టడంతో తహశీల్దార్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి రూరల్ సీఐ అస్సార్‌బాషా, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు ఎస్‌ఐలు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. దీంతో సీపీఐ నాయకులు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.
తాము పేదలకు భూమి ఇప్పించడానికి పోరాటం చేస్తుంటే పోలీసులను మోహరించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ భూమి ప్రజల భూమి అని, భూమిలేని పేదలు సాగు చేసుకోవడానికి వచ్చి న సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని ఎవరికీ ఇవ్వకూడదన్న నిభందన ఉందని తహ శీ ల్దార్ వారికి తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు సేద్యం పనులు ప్రారంభించి వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జిల్లా కార్యదర్శి జగదీష్, పైలానరసింహయ్య, రంగయ్య, శింగనమల గోపాల్ పాల్గొన్నారు.