కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి సేవలు అందని ద్రాక్షగా మారాయి. స్త్రీవైద్య నిపుణులు, మత్తు మందు వైద్యుల కొరత, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ప్రసవమంటే పరీక్షలా మారింది. వైద్య సిబ్బంది వసతులు లేవంటూ గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రులకు, వరంగల్ ఎంజీఎంకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఆసుపత్రిని మంగళవారం ‘న్యూస్‌లైన్’ విజిట్ చేయగా.. ప్రసూతి సేవలు పైన పటారం.. లోన లొటారంలా కనిపించాయి.
కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ప్రసూతి సేవలు మృగ్యమయ్యాయి. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన అమ్మలాలన పథకంలో భాగంగా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు కాని సీరియస్ కేసులను ప్రధానాస్పత్రికి పంపిస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి నిత్యం 20 మంది వరకు ప్రసూతి సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రసవవేదనతో తల్లడిల్లుతూ మెరుగైన వైద్యసేవలందుతాయనే ఆశతో వచ్చిన వారికి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. నెలలు నిండి నొప్పులతో బాధపడుతున్న వారికి వైద్యం చేయుమని వేడుకున్నా కనికరించరు. కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని చెబుతూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. రోగుల బంధువులు వెళ్లి అడిగినా ఇక్కడి వైద్యులకు, నర్సులకు ఆ ‘సీరియస్’నెస్ మాత్రం అర్థం కాదు. ‘కాన్పు ఎప్పుడు చేయాలో మాకు తెలుసు’ అంటూ ఈసడించుకుంటుంటారు.
తీరా ప్రాణాల మీదకు వచ్చాక గైనకాలజిస్టులు లేరని చేతులెత్తేస్తున్నారు. కేసు సీరియస్‌గా ఉందని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రసవ వేదన పడుతున్నవారు కనీసం రెండు గంటల ప్రయాణం చేస్తే కానీ వరంగల్ చేరుకోలేరు. అసలే సీరియస్ అని చెప్పి పంపిస్తున్న సిబ్బందికి రెండు గంటలు ఆ గర్భిణులు ఎలా భరిస్తారన్న కనీస సోయి కూడా ఉండడం లేదు. మానవత్వం కూడా లేకుండా ఒక్కో ఆంబులెన్సులో నలుగురైదుగురిని ఒకేసారి తరలిస్తున్నారు. వైద్యుల నిర్వాకంతో ప్రభుత్వ ప్రధానాస్పత్రి అంటేనే భయపడాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. సకల సౌకర్యాలతో కాన్పు చేసి తల్లీబిడ్డను క్షేమంగా పంపిస్తామని చెప్పి తీసుకువచ్చి... తీరా ఇప్పుడు వరంగల్ పంపిస్తున్నారని ఆస్పత్రిలోని గర్భిణీ తల్లి గౌరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదుగురికి ఇద్దరే..
ప్రభుత్వాస్పత్రిలో ఐదుగురు గైనకాలజిస్టులు, ఐదుగురు అనస్తీషియా వైద్యుల పోస్టులున్నాయి. వీరిలో ఇద్దరు గైనకాలజిస్టులు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తుండగా, ఇద్దరు అనస్తీషియా వైద్యులు మాత్రమే ఉన్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీనే. అమ్మలాలనలో భాగంగా ఆస్పత్రికి వచ్చే గర్భిణీల సంఖ్యకు తగినట్లుగా డాక్టర్లు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోవడంతో కడుపులోనే శిశువులు మరణిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుతోపాటు తల్లి ప్రాణాలకు కూడా ఆపదలు వచ్చిన ఘటనలున్నాయి. వైద్యుల నియామకాల విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు.
ఇదే అదను
పని తప్పించుకునేందుకు ఇప్పుడు మంచి సాకు దొరుకుతోంది. వైద్యులు, సిబ్బంది కొరత ఉందని గర్భిణులకు భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇందులో ఎక్కువగా డాక్టర్లే పలానా ఆస్పత్రికి వెళ్లమని సూచించి అవసరాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజుల్లో ఇప్పటివరకు 10 మందిని వరంగల్ ఎంజీఎంకు తరలించగా, 10 మంది గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లినట్లు సమాచారం. వరంగల్‌కు తరలిస్తున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ డంతో వారు భరించలేక ప్రైవేట్‌కు వెళ్తున్నారని అంబులెన్స్ సిబ్బంది తెలుపుతున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కబుర్లతో కాలక్షేపం చేస్తుండగా, ఆర్‌ఎంవో ఓపీ చూసేందుకే పరిమితమయ్యారు.
అదనపు వార్డుకు తాళం
అమ్మలాలన కార్యక్రమంలో ప్రసవం అనంతరం వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అదనపు వార్డు(లేబర్ రూమ్)కు తాళం వేశారు. ఆదివారం వరకు బాలింతలు, శిశువులతో కనిపించిన ఈ వార్డు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. గర్భిణులను ఎంజీఎంకు తరలించడంతో బెడ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ప్రసూతివార్డులో మాత్రం ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు జరిగిన బాలింతలు ఉన్నారు. ప్రసవ కోసం వచ్చిన వారు 10 మందికి మించి లేరు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ‘న్యూస్‌లైన్’ పరిశీలించగా లేబర్‌రూమ్ లాక్ చేసి ఉండగా, సిబ్బంది ఎవరూ కనిపించలేదు.
అడ్మిట్ చేసుకుంటున్నం
- డాక్టర్ కొండల్‌రెడ్డి,
ఆస్పత్రి సూపరింటెండెంట్
ప్రసూతి వార్డు ఖాళీగా లేదు. వైద్యసేవల నిమిత్తం వచ్చిన వారిని చేర్చుకుంటున్నాం. చాలా సీరియస్‌గా ఉంటేనే ఎంజీఎం లాంటి పెద్దాసుపత్రికి పంపిస్తున్నాం. గుండె సమస్యలు, హై బీపీ వంటి ఇతర ఇబ్బందులు ఉండి కేసు సీరియస్‌గా ఉంటే ప్రాణం కాపాడడానికే తరలిస్తున్నాం.
పట్టించుకునేవారు లేరు
ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. పొద్దున ఒకసారి డాక్టర్ వచ్చి చూస్తరు. పరీక్ష చేయరు. రోజు ఒకే మందులు. అవి కూడా రెండే ఇస్తున్నారు. అమ్మలాలన అంటున్నరు.. ఇక్కడ పడేసి పోతున్నారు.
- సంధ్య, కేశవపట్నం
దుర్వాసన..
ఆస్పత్రి ఆవరణ మురుగునీటితో నిండి దుర్వాసన వస్తోంది. దోమలబాధ భరించలేకపోతున్నాం. ఫ్యాన్లు లేవు. పగలు గాలి ఆడదు. 20 మంది ఉండాల్సిన వార్డులో ఇంతమందిని ఉంచారు. బాత్‌రూమ్ వాసన చెప్పలేం. ఇక్కడ మనుషులు ఉండే వాతావరణమైతే లేదు.
- అనూష, అన్నారం
పెద్దాసుపత్రిలో ప్రసవ వేదన
Published Wed, Dec 4 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement