
సాక్షి, కరీంనగర్: లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 లక్షలు. తిరిగి ఇచ్చేయాలన్న నియమమేమీ లేదు. అయినా.. వారు ఆ డబ్బును తిరస్కరించారు. తాము మంచి స్థితిలోనే ఉన్నామని, దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో సిసలైన శ్రీమంతులు అనిపించుకున్నారు.
తాము ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నామని, తమకు రూ.10 లక్షల సాయం అవసరం లేదని స్పష్టంచేశారు. గివ్ ఇట్ అప్ (వదులుకోవడం) కింద వీరు తమకు వచ్చే భారీ ఆర్థికసాయాన్ని వదులుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు. వీరిలో ముగ్గు రు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా హు జూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. తాజాగా ఐదుగురు వ్యక్తులు తామెందుకు దళితబంధు సాయాన్ని వద్దనుకుంటున్నారో తెలుసుకుందాం..!
పేదలకు ఉపయోగపడాలి
నేను గెజిటెడ్ ప్రాధానోపాధ్యాయునిగా పదవీవిరమణ పొందాను. నా భార్య కూడా ప్రభుత్వ టీచర్‌గా రిటైరయ్యారు. నేను అంబేడ్కర్ వాదిని. ఆయన కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని ఉన్నత స్థితికి చేరుకున్నా. ఇప్పటికీ ఇంకా ఎందరో దళితులు అట్టడుగు స్థితిలో ఉన్నారు. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను ఇతర పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాపస్ ఇచ్చా.
– కర్రె నరసింహస్వామి, హుజూరాబాద్
పేదల కోసం వదులుకున్నా
ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత స్థితిలో ఉన్నా. మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవీవిరమణ పొందారు. వారికి పెన్షన్ కూడా వస్తోంది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబాలకు ఉపయోగపడాలని గివిట్ అప్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చా.
– కర్రె కిరణ్ కుమార్, రైల్వే ఇంజనీర్, హుజూరాబాద్
నా పెన్షన్ చాలు
పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా రిటైరయ్యాను. ఇప్పటికీ చాలా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి. నాకు మంజూరైన దళితబంధు డబ్బులు పేద దళిత కుటుంబానికి ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు. అదే నాకు తృప్తి. నాకు వచ్చే పెన్షన్ సరిపోతుంది. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను వదులుకున్నా.
– సోటాల మోహన్‌రావు, రిటైర్డ్ ఇంజనీర్, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment