సాక్షి, కరీంనగర్: తెలంగాణ సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకూ కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో జరిగిన భారీ బహిరంగసభలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కరీంనగర్‌తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, సెంటిమెంటును, ఆత్మీయతను నెమరువేసుకున్నారు. 2018 మే 10వ తేదీన ఇదే వేదికగా తాను రైతుబంధు పథకాన్ని ప్రారంభించానని గుర్తుచేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదే మాదిరి దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించిన రైతుబీమా పథకం విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినప్పుడు తమను కొందరు ఎద్దేవా చేశారని, కానీ.. నేడు రాష్ట్రంలో ధాన్యంరాశులు పొంగిపొర్లుతున్నాయన్నారు. 3.40 కోట్ల టన్నుల దిగుబడితో ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోతున్నాయని, హమాలీలు ధాన్యాన్ని మోయలేకపోతున్నారని వివరించారు.
రాష్ట్రమంతా హుజూరాబాద్ వైపే..
ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ దళితబంధును హుజూరాబాద్‌లోని 21,000 కుటుంబాలకు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం విజయవంతం చేయడం మీపైనే ఉందని హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ పథకం అమలుపై రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు. అందుకే.. ఇక్కడి దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పథకం ప్రారంభం అనగానే, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ శాలపల్లికి వచ్చారని తెలిపారు.
అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వాగత ఉపన్యాసం చేశారు. పథకం అమలు చారిత్రక అవసరం అన్నారు. మంచి పథకం ప్రారంభం అవుతున్న వేళ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ఈ పథకానికి అధికారులపరంగా 100 శాతం తమ సహకారం ఉంటుందన్నారు. అదే విధంగా లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి కటింగ్‌ల పేచీ లేకుండా కొత్త ఖాతాలు ఇవ్వాలని కోరారు.
బందోబస్తు.. విజయవంతం..
సీఎం సభకు పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్ (లా అండ్ ఆర్డర్) బందోబస్తును పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లు చేశారు. వీఐపీల రాకపోకలు, వేదిక బాధ్యతలను ఖమ్మం సీపీ విష్ణువారియర్ పర్యవేక్షించారు. హెలిప్యాడ్ బాధ్యతలను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే చూసుకున్నారు.
అదే విధంగా సభకు వచ్చే వీఐపీలు, ట్రాఫిక్, సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందితో సీపీ సత్యనారాయణ నిరంతరం సమన్వయం చేసుకున్నారు. సభావేదిక వద్ద ఫీల్డ్‌అసిస్టెంట్లు, వీఆర్వోలు, ప్రతిపక్ష నాయకులు కొందరు ఆందోళన చేస్తారన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రతీ ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. ముఖ్యంగా సీఎం భద్రతా సిబ్బంది ఫేస్ రికగ్నైజేషన్, డ్రోన్ కెమెరాలతో సభా ప్రాంగణాన్ని డేగ కళ్లతో పర్యవేక్షించారు.
లక్షకుపైగా హాజరైన జనాలు..
శాలపల్లి సభా ప్రాంగణానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 60 వేల మంది వరకు రాగా, రాష్ట్ర నలుమూలల నుంచీ భారీగా హాజరయ్యారు. 825 ప్రత్యేక బస్సుల్లో నిర్దేశించిన ప్రకారంగా.. దళితబంధువులను అధికారులు సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సభ ప్రారంభమయ్యే ముందు, ముగిసిన అనంతరం సుమారు మూడు గంటలపాటు దాదాపు ఆరు కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సభ ప్రారంభయ్యే ముందు, తిరుగు ప్రయాణంలో సీఎం హెలికాప్టర్ సభా వేదిక చుట్టూ పలుమార్లు చక్కర్లు కొట్టింది.
దారులన్నీ శాలపల్లి వైపే..
హుజూరాబాద్/హుజూరాబాద్‌రూరల్/ఇల్లందకుంట/వీణవంక:శాలపల్లి గ్రామం మరోసారి చరిత్రకు వేదికగా మారింది. 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా.. మళ్లీ ఇదే వేదికపై ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్దమొత్తంలో దళితులు శాలపల్లికి కదలివచ్చారు. ఊరూవాడ నుంచి ప్రజలు తరలిరావడంతో హుజూరాబాద్‌లో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం గులాబీమయంగా మారింది.హుజూ రాబాద్, జమ్మికుంట పట్టణాల్లో భారీ హోర్డింగులు, ఫెక్ల్సీలు, తోరణాలతో ఆకట్టుకున్నాయి.
కరుణించిన వరుణుడు
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సభ నిర్వహణపై ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడినా.. వర్షం కురవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించారు. సభ కొనసాగినంతసేపు వాతావరణం అనుకూలించడంతో అధికారులు, మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment