గద్వాల, న్యూస్‌లైన్: పంట నష్టపరిహారం అందించడంలోనూ పాలకులు పాలమూరు రైతాంగంపై సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. కరువు నేలలో పంటలు పండించలేక ఈ ప్రాంతరైతులు వలసబాట పట్టారు. ఉన్న ఊరు, పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న కొద్దిమంది రైతులకు కూడా సర్కారు సాయం అందడం లేదు. ఈ రెండేళ్లలో జిల్లాలో పండ్లతోటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోవడమే ఇందుకు నిదర్శనం.
కానీ పొరుగు జిల్లా నల్గొండకు పరిహారం మంజూరుచేసి జిల్లా రైతులను విస్మరించడం శోచనీయం.. జిల్లాలో పండ్లతోటలకు నెలవుగా ఉన్న గద్వాల డివిజన్‌లో బత్తాయి, మామిడి వంటి తోటలను వేలాది హెక్టార్లలో సాగుచేశారు. గతేడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో దశాబ్దాలుగా పండ్లతోటలపై ఆధారపడి..వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రనష్టాలను చవిచూశారు.
తోటలకు నీళ్లందించలేని పరిస్థితుల్లో జిల్లాలో గతేడాది సుమారు 5,150 హెక్టార్లలో బత్తాయి, మామిడి తదితర పండ్లతోటలను నష్టపోయారు. ఈ ఏడాది సుమారు 800 హెక్టార్లలో పంటతోటలకు నష్టం వాటిల్లింది. తమను ఆదుకోవాలని బాధితరైతులు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు.
నివేదిక బుట్టదాఖలు!
రైతుల విజ్ఞప్తి మేరకు మండలాలు, గ్రామాలవారీగా ఎండిపోయిన తోటల వివరాలను 2011-12లో ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారుల ద్వారా సంయుక్త సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీనిప్రకారం 2011-12లో గద్వాల డివిజన్‌లోని మల్దకల్, ధరూరు మండలాల్లో అత్యధికంగా, మిగతా మండలాల్లోనూ బత్తాయి తోటలు ఎక్కువగా, మామిడి తోటలు అక్కడక్కడ ఎండిపోయినట్లు నివేదికలు సిద్ధంచేశారు.
కేవలం గద్వాల డివిజన్‌లో 1853 హెక్టార్లలో పండ్లతోటలు నీళ్లందక ఎండిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే 2012-13లోనూ అయిజ, గట్టు మండలాల్లో ఎక్కువగా, మిగతా మండలాల్లో అక్కడక్కడ బత్తాయి, మామిడి తోటలు 145 హెక్టార్లలో ఎండిపోయినట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ రెండేళ్ల నివేదికలు ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి తప్ప పరిహారం మంజూరుకాలేదు. కాగా, గతనెలలో పరిహారం అందజేసేందుకు రైతులు, బ్యాంకు ఖాతాలను ఉద్యానవన శాఖాధికారులకు అందజేయాలని ప్రకటన జారీకావడంతో బాధితరైతుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఖాతాలను అందజేసినా పరిహారం ఇప్పటికీ మంజూరుకాలేదు.
అయితే పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలోని పండ్లతోటల రైతులకు 2011-12 సంవత్సరానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పటికే అందజేసినట్లు హార్టికల్చర్ అధికారుల ద్వారా తెలిసింది. పాలమూరు జిల్లాలో నష్టపోయిన రైతులను మాత్రం పట్టించుకోవడం లలేదు. ఇకనైనా జిల్లా అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి నష్టపోయిన తమకు పరిహారం వచ్చేవిధంగా చూడాలని బాధితరైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాలమూరు రైతుకు మొండిచేయి
Published Sun, Oct 20 2013 4:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement