గ్రామాభ్యుదయమే లక్ష్యం | In terms of the development of the villages and towns | Sakshi
Sakshi News home page

గ్రామాభ్యుదయమే లక్ష్యం

Published Mon, Jan 27 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

గ్రామాభ్యుదయమే లక్ష్యం

గ్రామాభ్యుదయమే లక్ష్యం

  •     పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి కృషి
  •      కాకతీయ ఉత్సవాల స్ఫూర్తితో మేడారం ఏర్పాట్లు
  •      1.26 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు
  •      ఇప్పటివరకు ‘దేవాదుల’ ఖర్చు రూ. 6,723 కోట్లు
  •      పథకాలు పేదలందరికీ చేరేలా ప్రతిఒక్కరూ పాటుపడాలి
  •      గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ గంగాధర కిషన్
  •  
    కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు... వాటి అభివృద్ధే నిజమైన స్వరాజ్యం’ అన్న మహాత్మాగాంధీ మాటలు స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో మండల స్థాయి అధికారులను గ్రామాభ్యుదయ అధికారులుగా నియమించానని, పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

    65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి, పోలీసు బలగాల వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి గణతంత్ర సందేశం ఇచ్చారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కాకతీయ ఉత్సవాలను ఏడాదిపాటు అత్యంత వైభవంగా జరుపుకున్నామని, అదే స్ఫూర్తితో కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

    కాకతీయ ఉత్సవాల నిర్వహణతో పర్యాటక పరంగా జిల్లా ప్రగతి సాధించిందని, 60 లక్షలకుపైగా దేశీయులు, 800కు పైగా విదేశీ పర్యాటకులు జిల్లాను సందర్శించారని వెల్లడించారు. ఈ సారి ప్రకృతి కరుణించడంతో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైందని, రబీలో రైతులు 86,320 హెక్టార్లలో వరి, మొక్కజొన్న వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తున్నారన్నారు. రూ.2.94 కోట్ల రాయితీపై రైతులకు 11,688 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు.

    సాగునీటి ప్రాజెక్టుల పరంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద 1,26,260 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు చేపట్టారని, ఇప్పటివరకు భూసేకరణ, పునరావాస పనులకు రూ. 338 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం అమలుకు మూడు దశల్లో ఇప్పటివరకు రూ. 6,723 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎత్తిపోతల ద్వారా సుమారు 2.50 టీఎంసీల నీటిని ధర్మసాగర్, ఘన్‌పూర్, అశ్వరావుపల్లి, చీటకోడూరు, గంటరామారం, బొమ్మకూరు టపాసుపల్లి రిజర్వాయర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో 1.41 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

    ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఈ సంవత్సరం రూ.160 కోట్లతో 5.58 లక్షల మంది కూలీలకు పనిక ల్పించామని, రైతాంగం కోసం రూ.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద నర్సరీలు ఏర్పాటు చేసి జిల్లాలో 23.20 లక్షల మొక్కలను 8,772 మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. రూ.9.96 కోట్ల వ్యయంతో మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూముల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు.

    విద్యాపరంగా జిల్లాలో రూ.4.80కోట్లుతో 24 నూతన పాఠశాలల భవనాలు ప్రారంభించామని, బడిబయట ఉన్న విద్యార్థులను ప్రత్యేక కార్యక్రమం ద్వారా బడిలో చేర్పించామన్నారు. నూతనంగా ఆదర్శ పాఠశాలల్లో 271 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసినట్లు వెల్లడించారు. ఐటీడీఏ ద్వారా రూ.5.58కోట్లతో గ్రామాల్లో తాగునీటి పనులు పూర్తి చేశామని, నాబార్డు నిధులు రూ.3 కోట్లతో రోడ్లు వేయించామన్నారు. అటవీహక్కు గుర్తింపు చట్టం కింద 1,18,122 ఎకరాల భూమి హక్కు పత్రాలను 134 సామాజిక సంఘాలకు... 41,314 ఎకరాల భూమిని 14,016 మందికి  అందజేశామన్నారు.

    జిల్లాలో అమ్మహస్తం, అమృతహస్తం, పేదలకు బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఉపకారవేతనాల పంపిణీ జిల్లాలో పక్కాగా అమలవుతున్నాయని, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో వసతి గృహాల నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... వాటిని అన్నివర్గాలవారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే  సర్కారు లక్ష్యం నెరవేరినట్లు భావించాలని పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని నేరవేర్చేందుకు ప్రతిఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
     
    రాష్ట్ర పండగ మేడారం
     
    ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుందని, ఈ సారి కోటి మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశామన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తుల రద్దీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా తుమ్మల వాగు, వట్టి వాగుపై ైెహ లెవల్‌బ్రిడ్జి, జంపన్నవాగుపై స్నానఘట్టాల నుంచి గద్దెల వరకు నాలుగు లేన్లరోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు మేడారంలో అభవృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

    జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు కలెక్టర్ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పౌసుమి బసు, ఎన్పడీసీఎల్ సీఎండీ కార్తికయమిశ్రా, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణపండాదాస్, శిక్షణట్రెరుునీ కలెక్టర్ హన్మంతు, ఏజేసీ సంజీవయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, వెంకటేశ్వర్‌రావు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
     
    గుంపులో గోవిందా..!

     
    గ ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా చేపట్టే ఆవార్డుల కార్యక్రమంలో ఈ సారి జిల్లా యంత్రాంగం అనుసరించిన పద్ధతిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గుంపులో గోవిందా.. అన్నట్లు ప్రశంస పత్రాలు అందజేయడమే ఇందుకు కారణం. ఉద్యోగి సర్వీసులో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తముడిగా అవార్డు అందుకునే అవకాశం మహా అయితే ఒకటి రెండుసార్లకన్నా ఎక్కువ రాదు... అది కూడా అందరికీ రాదు... ఇలాంటి సమయంలో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ప్రశంసాపత్రాలు అందుకునే సమయానికి అంతా గుంపుగా వచ్చి అందుకోవాలని ప్రకటన చేయడంతో ద్యుగులు తీవ్ర నిరాశకు గురయ్యూరు. ఇక ముందయినా అధికారులు ఇలాంటి కార్యక్రమాల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement