విశాఖపట్నం, న్యూస్‌లైన్: మోసం చేయడంలోనూ ఓ ఆకు ఎక్కువే చదివాడీ ప్రబుద్ధుడు. దేశీయ ఉద్యోగాలనే కంటే విదేశీ ఉద్యోగాలంటే కాస్త గ్లామర్ ఎక్కువ ఉంటుందనుకున్నాడో ఏమో ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ-హూ)నే లక్ష్యంగా చేసుకున్నాడు. హూలో ఉద్యోగాలిప్పిస్తానంటూ విశాఖనగరం సీతంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్ జారీ చేశాడు. తన వలలో పడిన వారికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, గుర్తింపు కార్డులు జారీ చేసేశాడు. అవకాశాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసి ముఖం చాటేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం మేరకు... ప్రముఖ దినపత్రికల్లో జూన్ 2వ తేదీన హూలో పీఓ, ఏపీఓ, డీపీఓ, ఫీల్డ్‌ఆర్గనైజర్స్ ఉద్యోగాల భర్తీ కోరుతున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చూసిన కోటనందూరు, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. కొద్ది రోజుల తర్వాత ‘మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇవి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కావున కలెక్టర్, జేసీ, డీఎంఅండ్‌హెచ్‌ఓలను మేనేజ్ చేసేందుకు కొంతమొత్తం ఖర్చవుతుంది.
కావున మీరు కొంత నగదు మేమిచ్చిన అకౌంట్ నంబర్లలో జమ చేయగలరు’ అంటూ పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేలు చెల్లించాలంటూ సుబ్రహ్మణ్యం నిరుద్యోగులకు తెలిపాడు. పలువురి నుంచి ఆరు బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.7 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారందరికీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు (నకిలీవి) ఇచ్చేశాడు. ఈనెల 19న నర్సీపట్నంలో కలుద్దామని చెప్పాడు.
అభ్యర్థులు ఫోన్ చేస్తే జాయింట్ కలెక్టర్‌తో మీటింగ్‌లో ఉన్నానని 20న మేఘాలయ హోటల్‌లో కలుద్దామని నమ్మబలికాడు. నిజమే అనుకుని ఆశతో వచ్చిన వారికి అతని జాడ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు తమకు ఇచ్చిన నియామక పత్రాలు, గుర్తింపులు కార్డులు పట్టుకుని డీఎంఅండ్‌హెచ్‌ఓను కలిశారు. అటువంటి నియామకాలేవీ తాము చేపట్టలేదని చెప్పడంతో కంగుతిన్నారు. మోసపోయామని గుర్తించాక సీతంపేటలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లగా అతను పరారయినట్లు తెలిసింది.
తాము డబ్బు డిపాజిట్ చేసిన ఎస్‌బీఐ అకౌంట్ (నంబర్ : 20080917217) నంబర్‌లో వివరాలు సేకరించగా కంచరపాలేనికి చెందిన బి.వెంకటరత్నందిగా గుర్తించి ఆమె వద్దకు వెళ్లారు. ఆమెను నాల్గో పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చారు. ‘ఆ డబ్బు సంగతి తనకు తెలియదని, సుబ్రహ్మణ్యం తన ఏటీఎం కార్డు అడిగితే ఇచ్చానని’ ఆమె చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, నాల్గోపట్టణ పోలీసులు కేసు తమ పరిధిలోకి రాదని తెలిసి కానిస్టేబుల్‌ను బాధితులోపాటు పంపి రెండో పట్టణ పోలీసులకు పంపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు బంగారు త్రినాథరావు, పి.శివకుమార్, ఎల్.గణేష్‌కుమార్, ఆర్.జోగిరాజు, గాడి శ్రీను కోరారు. కాగా, ఇతని మాయలో పడిన బాధితులు ఇంకెంతమంది ఉన్నారో వెలుగు చూడాల్సి ఉంది.
ఉద్యోగాల పేరుతో మరో మోసం
Published Sun, Sep 22 2013 2:10 AM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM
Advertisement
Advertisement