బెంగళూరులో ఉన్నట్లు సమాచారం
ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు, పోలీసులు
భర్త తెలిపిన సమాచారంపై పోలీసుల అనుమానం
విజయవాడ సిటీ/పటమట : బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు కుమార్తెను తీసుకొని వెళ్లి అదృశ్యమైన ప్రైవేటు పాఠశాల అధ్యాపకురాలు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గణతంత్ర వేడుకల బందోబస్తు సమయంలో ఆమె అదృశ్యం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిం చింది. ఆమె అదృశ్యం వెనుక కారణాలను అన్వేషిస్తూనే.. మరో వైపు వివిధ ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఆమె ఆఖరిసారిగా ఎప్పుడు? ఎవరితో మాట్లాడిందీ? తెలుసుకునేందుకు పోలీసులు మొబైల్ కాల్ డేటా సేకరణలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగళూరులోని ఓ అరబిక్ మదర్సాలో ఉన్నట్టు సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. న్యూ రాజీవ్‌నగర్‌కి చెందిన షేక్ నజీర్‌బాషా బెంజిసర్కిల్ సమీపంలోని ఓ చెప్పుల కంపెనీ షోరూమ్‌లో పని చేస్తున్నారు. ఇతని భార్య రహమున్నిసా లబ్బీపేటలోని ఓ ప్రైవేటు ఉర్దూ పాఠశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తోంది. వీరికి అప్సా తబిసి, సాదియా తబిసి సంతానం. మచిలీపట్నంలోని బంధువుల ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె రెండో కుమార్తె సాదియాతో కలిసి బెంజిసర్కిల్ సమీపంలో మినీవ్యాన్ ఎక్కింది. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో భర్త ఆమెను ఆటో ఎక్కించాడు. అరగంట గడిచిన తర్వాత ఆటోలోని ప్రయాణికులందరూ దిగిపోయినట్టు భర్తకు ఫోన్‌లో తెలిపింది. ఆపై స్టేజీలో ఎవరైనా ప్రయాణికులు ఎక్కితే వెళ్లమని, లేకుంటే దిగి మరో ఆటో మారమని భర్త చెప్పారు. కొద్ది సేపటికి ముందు సీట్లో మరో వ్యక్తి ఎక్కినట్టు చెప్పిన కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ అయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భర్త పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం వరకు కూడా విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో ఆమె ఆచూకీ దొరకడం కుటుంబసభ్యులు, ఇటు పోలీసులకు ఊరట కలిగించింది.
బెంగళూరుకు పోలీసు బృందం
ఆమెను తీసుకొచ్చేందుకు పటమట పోలీసు బృందం అక్కడికి బయలుదేరింది. భర్తను తీసుకొని ఇక్కడి నుంచి బెంగుళూరు పోలీసు బృందం వెళుతున్నట్టు పటమట ఇన్‌స్పెక్టర్ కె.దామోదర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..అదృశ్యమైన ఆమె సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తాను బెంగళూరులోని ఓ అరబిక్ కాలేజీ మదర్సాలో ఉన్నట్టు భర్త, కుటుంబ సభ్యులకు తెలిపింది. మదర్సా ఇన్‌చార్జి ఫోన్ ద్వారా ఆమె భర్తతో మాట్లాడింది. అక్కడికి ఎందుకు వెళ్లిందనే విషయమై ఆరా తీసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఆ విషయాలన్నీ తన భర్తకు తెలుసని చెప్పినట్టు తెలిసింది. ఆమె ఆచూకీ విషయం తెలిసిన వెంటనే పటమట పోలీసులకు ఆమె భర్త విషయం చెప్పాడు. పోలీసులు అక్కడి ఇన్‌చార్జితో మాట్లాడి ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు.
ఆటో ఎక్కలేదా?
మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంజిసర్కిల్ సమీపంలో మినీ వ్యాన్ ఎక్కించినట్టు భర్త చెప్పి విషయాల్లో వాస్తవం ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పామర్రు వరకు వెళ్లే వరకు తనతో ఆమె ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులకు భర్త తెలిపాడు. అంత దూరం వెళ్లిన ఆమె వెనుదిరిగే అవకాశాలు లేవని చెపుతున్నారు. ఆమె వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
కుమార్తె సహా వివాహిత అదృశ్యం
Published Tue, Jan 27 2015 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement
Advertisement