
అల్లుకుపోతున్న ఆయిల్ మాఫియా
- విశాఖ నుంచి శ్రీకాకుళానికి...
- ఆధిపత్యం కోసం ఇరు వర్గాల ఘర్షణ
- గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స
సాక్షి, విశాఖపట్నం: ఆయిల్ మాఫియా మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. రెండు నెలల క్రితం నగరంలో 14మంది మాఫియా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఇక ఈ దందా సాగనివ్వబోమని పోలీసులు ప్రకటించారు. కానీ విశాఖ నగరానికే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు ఆయిల్ మాఫియా కార్యకలాపాలు విస్తరించాయని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తాజా సంఘటన బయటపెట్టింది. రణస్థలం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడి పెసరపాలెంలో వేస్ట్ ఆయిల్ వ్యాపారం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరిలో విశాఖ నుంచి వెళ్లిన వారు 11 మంది కాగా అక్కడ వ్యాపారం చేస్తున్నవారు మరో ముగ్గురు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఎన్నో ఏళ్లుగా ఓ ముఠా నగరంలో ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతోంది. తర్వాత వారిలో వారికి మనస్పర్ధలు రావడంతో ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. నగరంలోని పోర్టు, రైళ్లు, లారీల నుంచి ఆయిల్ దొంగిలిస్తున్నారు. భూ మాఫియా, డ్రగ్స్ మాఫియా కంటే దారుణంగా ఇది విస్తరించింది. తమ దందాకు ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే వారిపై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా గ్యాంగ్ వార్ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రౌడీల మధ్య జరుగుతున్న గొడవలతో నగరంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి. పోలీస్ యాక్ట్ 30, 31(ఎ) సెక్షన్లను కూడా అమలులో పెట్టారు. ఇప్పుడు ఆయిల్ మాఫియా కూడా తోడవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.