విశాఖకు సుస్తీ..!
డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలు
అర్బన్‌లో పెరిగిన వ్యాధులు
విశాఖకు సుస్తీ చేసింది. రకరకాల జ్వరాలు, జబ్బులతో సతమతమవుతోంది. కాలంతో నిమిత్తం లేకుండా పలు వ్యాధులతో జనం అవస్థలు పడుతున్నారు. రోజూ వేలాది మంది రోగాలతో ఆస్పత్రుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. మౌలిక వసతులు అంతగా ఉండని గ్రామీణ ప్రాంతాలకంటే సకల సదుపాయాలూ ఉన్న అర్బన్ పరిధిలోనే డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తుండడం విశేషం. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ దాడి చేస్తున్న జ్వరాల తీరుతెన్నులపై ఈ కథనం..!
- సాక్షి, విశాఖపట్నం
కొన్నాళ్లుగా విశాఖను విషజ్వరాలు, చికున్‌గున్యా జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. జిల్లాలో పల్లెల్లోనూ, నగరంలోని వార్డుల్లోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత ఏడాదికంటే ఈ సంవత్సరం వీటి తీవ్రత మరింత అధికమవుతోంది. ఇంకా వర్షాలు పూర్తిస్థాయిలో ఊపందుకోకముందే జ్వరాలు, రోగాల తీవ్రత ఇలా ఉంటే వానాకాలం మొదలైతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది మొత్తమ్మీద 381 డెంగ్యూ కేసులు, 87 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు డెంగ్యూ కేసులు 173, చికున్ గున్యా జ్వరాలు 45 కేసులు రికార్డయ్యాయి. అలాగే గత సంవత్సరం 8410 మంది మలేరియాతో బాధపడగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 9119 మంది బారినపడ్డారు. అయితే అనధికారిక రోగ పీడితుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇక ప్రాణాంతక డెంగ్యూ జ్వరాలు నగరంలో కొద్ది రోజుల నుంచి తిష్టవేసి కూర్చున్నాయి.
ముఖ్యంగా గాజువాకలోని అఫీషియల్ కాలనీ, కుంచుమాంబ కాలనీ, అజీమాబాద్, డ్రైవర్స్ కాలనీ, టీడీపీ కాలనీ, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాలు, పెదగంట్యాడ మండలంలో పలు గ్రామాల్లోను, మధురవాడలోని మారికవలస, రాజీవ్ గృహకల్ప, కొమ్మాది, పీఎంపాలెం, పెందుర్తి మండలం కోట్నివానిపాలెం, బంధంవాని పాలెం, సబ్బవరం మండలం మొగలిపురం, గోపాలపట్నం ఇందిరానగర్, లక్ష్మీనగర్, ప్రహ్లాదపురం, అడవివరం తదితర ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు బాధిస్తున్నాయి. కొన్ని చోట్ల అదుపులోకి వచ్చినా కొత్తగా మరికొందరికి డెంగ్యూ సోకుతోంది. డెంగ్యూతో జిల్లాలోనూ, నగరంలోనూ ఇప్పటిదాకా పదిమందికి పైగానే మృత్యువాతపడ్డారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కరే మరణించినట్టు తేల్చారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా నమోదయిన 173 డెంగ్యూ కేసుల్లో 125 కేసులు (ఆగస్టులో 41, సెప్టెంబర్‌లో 47, అక్టోబర్‌లో 37) కావడం విశేషం. ఇక ఎపిడమిక్ సీజనుగా భావించే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 7787 మందికి సోకగా, సీజను ముగిసిన ఈ రెండు నెలల్లో ఇప్పటివరకు 1332 కేసులు నమోదయ్యాయి. మలేరియా జ్వర లక్షణాలతో ఒక్క మన్యంలోనే 25 మర ణాలు సంభవించినా అధికారికంగా ఒక్క మరణాన్ని కూడా చూపడం లేదు. ప్రస్తుతం మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు.
మన్యం లో మలేరియా అదుపులోకి వచ్చిందనుకుంటున్న తరుణంలో తాజాగా సోమవారం అనంతగిరి మండలం కాశీపట్నంలో చేపల దారప్ప మలేరియా లక్షణాలతో మరణించడం మళ్లీ కలకలం రేపుతోంది. చోడవరం, బుచ్చియ్యపేట, రావికమతం, మాడుగుల, నర్సీపట్నం, మాకవరపాలెం తదితర మండలాల్లో విష జ్వరాలు జోరుగా ఉన్నాయి. జ్వర బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
నివారణ చర్యలు
జిల్లా కంటే అర్బన్ లోనే డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. దోమకాటుతో వచ్చే డెంగ్యూ వల్ల ఇళ్లలోనూ, బయట నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. ఇందుకోసం ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటించాలని కోరుతున్నాం. ప్రజల్లో అవగాహనకు, గ్రామా ల్లో పారిశుద్ధ్యం, కాలువల్లో పూడికతీత తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, నగర, పురపాలక సంఘా ల్లో మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చాం. అవసరమైతే యాంటీ లార్వల్ ఆపరేషన్ చేపడ్తాం.
-సరోజిని, డీఎంహెచ్‌ఓ