జిల్లావాసులను ఉల్లి కన్నీళ్లు ఇప్పట్లో వీడేలా లేవు. పెరిగిన ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వీటి ధర మరో రెండు మూడు నెలలైనా తగ్గేలా కనిపించడం లేదు.
సాక్షి, విశాఖపట్నం : జిల్లావాసులను ఉల్లి కన్నీళ్లు ఇప్పట్లో వీడేలా లేవు. పెరిగిన ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వీటి ధర మరో రెండు మూడు నెలలైనా తగ్గేలా కనిపించడం లేదు. ఆకాశాన్నంటిన ధరలను ఎలాగైనా దించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. డిమాండ్, సప్లయికి మధ్య అంతరం రోజురోజుకు పెరిగిపోతుండటంతో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాకు 136 మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరమైతే కేవలం 3 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. దీంతో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కిలో రూ.60పైనే అమ్ముడుపోతోంది. దీనిని తగ్గించే క్రమంలో జిల్లా అవసరాలకు మించి సరకును దిగుమతికి ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
అందు కోసం రాష్ట్రంలో కర్నూలు తర్వాత హోల్‌సేల్ ఉల్లి వ్యాపారానికి రెండో కేంద్రంగా పెట్టింది పేరైన తాడేపల్లిగూడెం నుంచి రప్పించాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఇద్దరిని అక్కడకు ధరలు, నాణ్యత పరిశీలనకు పంపారు. తీరా అక్కడ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి రూ.50 పలుకుతోంది. దానికి తోడు నిల్వలు తక్కువగా ఉండటం, ఉల్లిపాయల నాణ్యత అసలేం బాగోలేకపోవడంతో చేసేది లేక ఇటీవల తిరిగొచ్చేశారు. అక్కడ కొనుగోలుచేసినా రవాణా ఖర్చుతో కలిసి ఇక్కడ ధరకే అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టవుతుందని ప్రయత్నాలు విరమించుకున్నారు.
మరోపక్క సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగైనా తగ్గించే ప్రయత్నాలు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించడంతో జేసీ కూడా రంగంలోకి దిగారు. మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడారు. అవసరమైతే జిల్లాతోపాటు చుట్టు పక్క జిల్లాల్లో ఉల్లిసాగుచేసే రైతులు,వ్యాపారులతో మాట్లాడి వారి నుంచి నేరుగా కొనుగోలుచేసి రైతుబజార్లలో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాని వ్యాపారుల వద్దకూడా నిల్వలు లేకపోవ్చనే సమాచారంతో తదుపరి ఏంచేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు.
అక్కడంతా కుళ్లిపోయింది... : కర్నూలుతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు ఉల్లి దిగుమతవుతోంది. ఇందులో అధిక భాగం మహరాష్ట్ర, కర్ణాటక నుంచే అధికారులు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అక్కడ భారీ వర్షాలతోపాటు,వరదల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోయింది. ఉపయోగానికి వీలులేకు ండా కుళ్లిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఉల్లి ధరలు దిగిరావాలంటే ఎంతలేదన్నా 140 మెట్రిక్ టన్ను ల సరకు వస్తేనే ధరలు దిగివస్తాయని చెబుతున్నారు.