సాక్షి, అమరావతి, కర్నూలు(అగ్రికల్చర్) : ఒకవైపున రాయితీపై రైతు బజార్లలో ఉల్లిని సరఫరా చేస్తూనే మరోవైపున బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెటింగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రవాణా శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం వరకు పోటీపడి క్వింటా రూ.13 వేలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు శనివారం కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్వింటా రూ.8,750కి మించి కొనుగోలు చేయలేదు. వచ్చిన ఉల్లిలో 30 నుంచి 40 శాతానికి మించి కొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ట్రేడర్లతో పోటీపడి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. నాణ్యమైన ఉల్లి మార్కెట్‌లో కనిపిస్తే ఎంత రేటుకైనా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తుండటంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు శనివారం 1000 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా రూ.8,500 చొప్పున మార్కెటింగ్ శాఖ 550 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్‌కు 6,500 క్వింటాళ్లు రాగా, మార్కెటింగ్ శాఖ క్వింటా రూ.8,750 – రూ.9,300 చొప్పున 4,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు 33,950 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తోంది.
రైతుబజార్లకు సత్వరమే చేరవేత
షోలాపూర్, ఆల్వార్ నుంచి ఉల్లి దిగుమతులు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. కొనుగోలు చేసిన ఉల్లిని వెంటనే రాయితీపై రైతుబజార్లలో విక్రయించేందుకు సత్వర రవాణాకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాయలసీమ జిల్లాలకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసిన ఉల్లిని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలకు, షోలాపూర్ నుంచి వచ్చిన ఉల్లిని ఉత్తరాంధ్రకు రవాణా చేస్తున్నారు. రవాణాలో జాప్యాన్ని నివారించడంతోపాటు ఖర్చులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన మార్కెట్ల వద్ద ఉల్లి రవాణా, కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిఘా కొనసాగిస్తోంది.
ఇతర రాష్ట్రాలకు ఉల్లిని ఎగుమతి చేస్తున్న లారీలను తనిఖీ చేస్తోంది. సరైన డాక్యుమెంట్లు లేకపోతే లారీలను నిలిపివేస్తోంది. వేలం పాటలు జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్న ట్రేడర్ల వివరాలను విజిలెన్స్ విభాగం అధికారులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు భయపడి పెద్ద మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికితోడు డైలీ ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేలంలో ఉల్లి ధర తగ్గింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి
Published Sun, Dec 8 2019 4:27 AM | Last Updated on Sun, Dec 8 2019 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment