
పెరిగిన రైల్వే ఆదాయం
ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే వాటిలో విజయనగరం జంక్షన్ ఒకటి. ప్రధాన జంక్షన్ కావడంతో ఇక్కడి నుంచే అధిక సంఖ్యలో మామిడి, చేపపిల్లలు, దుస్తుల ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి.
విజయనగరం టౌన్ : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే వాటిలో విజయనగరం జంక్షన్ ఒకటి. ప్రధాన జంక్షన్ కావడంతో ఇక్కడి నుంచే అధిక సంఖ్యలో మామిడి, చేపపిల్లలు, దుస్తుల ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. సీజనల్ వ్యాపారంలో భాగంగా ఎక్కువగా మామిడి కాయలు, మామిడి పండ్లు ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. మామిడి పండ్లు అధికంగా ఢిల్లీకి, మామిడి కాయలు కోర్బా, బిలాస్‌పూర్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 6వ తేదీ వరకు 38 గూడ్స్ రైళ్లలో ఇక్కడ నుంచి మామిడి పండ్లు, కాయలు ఎగుమతి జరిగినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది.
మొత్తం 39, 317 టన్నుల లోడులకు గాను రైల్వే శాఖకు 9.95 కోట్ల రూపాయలు ఆదాయం లభించిదని చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ ఎంవీ రమణ తెలిపారు. గతేడాదితో పోల్చితే రైల్వే బుకింగ్ ప్రైట్ చార్జీలు 25 శాతం పెరిగింది. దీంతో గతేడాది ఎగుమతి జరిగిన సరుకుతో పోల్చితే ఈ ఏడాది సరుకు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది. రాయపూర్, కోల్‌కత్తా, తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు దుస్తులు, అలాగే కోల్‌కత్తా నుంచి చేప పిల్లలు దిగుమతి అవుతుంటాయి. మామిడి పండ్లకు సంబంధించి జిల్లా నుంచి మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్, ది మ్యాంగో ఫార్మర్స్ అసోసియేషన్‌ల ద్వారా బుకింగ్‌లు జరుగుతున్నాయి. గూడ్స్ ట్రైన్ ఒక ట్రిప్పునకు (కోల్‌కత్తాకు) 28 లక్షల 22 వేల 400 రూపాయలు చార్జి చేస్తున్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధించి రైల్వే అధికారులు 50 శాతం రాయితీ ఇస్తున్నా సరిపడా సరుకు లేకపోవడంతో సగం భోగీలు ఖాళీగా వదిలేయాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆదాయ వివరాలు :
సంవత్సరం ఎగుమతి ఆదాయం
(టన్నులు) (కోట్ల రూపాయల్లో)
2011 34,560 4.93
2012 50,190 7.44
2013 51,965 9.53
2014 39,317 9.95
సద్వినియోగం చే సుకోవాలి
ఈస్ట్‌కోస్ట్ రైల్వే అందిస్తున్న 50 శాతం రాయితీని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. రోడ్డు రవాణా కంటే సురక్షితంగా వెళ్లే భారతీయ రైల్వేలను వ్యాపారులు వినియోగించుకోవాలి.
-ఎంవి.రమణ,
చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్, విజయనగరం