స్వరాజ్య సంబరం..ఇదిగో సురాజ్యం | Independence Day Celebrations In Visakhapatnam | Sakshi
Sakshi News home page

స్వరాజ్య సంబరం..ఇదిగో సురాజ్యం

Published Fri, Aug 16 2019 8:00 AM | Last Updated on Fri, Aug 16 2019 8:54 AM

Independence Day Celebrations In Visakhapatnam - Sakshi

పంద్రాగస్టు వేళ పల్లెలు, పట్టణాలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. త్రివర్ణపతాకం సాక్షిగా సురాజ్యం మొదలైంది. జనహితమే అభిమతంగా.. నవశకమే ధ్యేయంగా ఇచ్చిన మాట ప్రకారం గ్రామ/వార్డు వలంటీర్‌ వ్యవస్థకు సర్కారు శ్రీకారం చుట్టింది. సచివాలయ వ్యవస్థ దిశగా తొలి అడుగు పడింది. ప్రగతి పథంలో విశాఖ రథాన్ని పరుగులెత్తించడమే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. నగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా వెంటరాగా జాతీయ జెండాను ఎగురువేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తన సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఉన్నత లక్ష్యాల సాధనకే నవరత్నాలైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ నగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా వెంటరాగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి తన సందేశాన్ని వినిపించారు. ‘నవరత్నాల’ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సమర్థవంతమైన, అవినీతి రహిత పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిల్లో పనిచేయడానికి కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే నవరత్నాలు పారదర్శకంగా అందేలా చూడటానికి, అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ప్రజల ముంగిట ఉంచేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

మోపిదేవి ప్రసంగంలో ముఖ్యాంశాలు
-జిల్లాలోని 325 గ్రాయ పంచాయతీల్లో 739 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. 
-వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం.
-వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే పంటల బీమా, అలాగే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం నాలుగేళ్ల కాలానికి రూ.50 వేలు ప్రభుత్వం ఇస్తుంది.
-రెతులకు వడ్డీలేని పంటరుణాలు, ఉచితంగా బోరు, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం.
-రైతు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం ప్రభుత్వం అందజేస్తుంది.
-ప్రతి నియోజకవర్గంలో పంటల నిల్వ కోసం శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నాం.
-ఈ ఖరీఫ్‌లో రూ.18 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేయాలనేది లక్ష్యం.
-జనని శిశు సురక్ష కార్యక్రమం ద్వారా బాలింతలకు ఉచితంగా రవాణా, భోజనం సౌకర్యాల కల్పన. మందులు, వైద్య పరీక్షలు, రక్తం, అవసరమైతే సిజేరియన్‌ తదితర వైద్యసేవలు అందిస్తున్నాం. 
-వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో రూ.108.42 కోట్ల వ్యయంతో 43 వేల మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు జరిగాయి. జిల్లాలో 65 కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు జరుగుతోంది.
-ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అత్యాధునిక వైద్యసేవలు అందించడానికి వైఎస్సార్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ మంజూరు.
-అర్హులైన ప్రతి కుటుంబానికి  వైఎస్సార్‌ గృహనిర్మాణ పథకం కింద పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్ష పట్టాలు, పట్టణాల్లో 2 లక్షల పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
-గ్రామాల్లో తాగునీరు అందజేసేందుకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ గ్రాంట్‌ రూ.57 కోట్లతో 758 మంచినీటి పథకాలు మంజూరయ్యాయి.
-దేశంలోనే ఎక్కువగా వంటగ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసిన జిల్లాగా మన విశాఖ నిలిచింది.
-జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధికల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
-రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రానున్న హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, రుషేల్‌ డీకాక్స్‌ వంటి 51 భారీ తరహా పరిశ్రమల ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
-విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక నడవ (వీసీఐసీ) కోసం 6,800 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు సిద్ధమైంది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
-నూతన ఎం–పార్కు విధానం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామికవాడలు స్థాపించే లక్ష్యంతో 15 పార్కులు గుర్తించడమైంది.
-ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ‘అరకు ఎకో టూరిజం సర్క్యూట్‌’ ఏర్పాటు కోసం రూ.156 కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం.
-మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగి, స్మారక స్థలం కృష్ణదేవిపేటలో పర్యాటక అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసింది.
-పింఛన్ల పెంపు ద్వారా జిల్లాలోని 4.16 లక్షల మందికి మేలు జరిగింది.
-వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 43వేల స్వయంసహాయక (డ్వాక్రా) సంఘాలకు ఏప్రిల్‌ వరకూ ఉన్న రూ.1,892 కోట్ల బ్యాంకు అప్పులను నాలుగు వాయిదాల్లో మాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
-బ్యాంకు లింకేజీ ద్వారా గత నెల వరకూ 8,297 డ్వాక్రా సంఘాలకు రూ.159.17 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయి. 
-వైఎస్సార్‌ బీమా పథకం కింద జిల్లాలోని 19.14 లక్షల మందిని అసంఘటిత కార్మికులుగా గుర్తించారు. 
-గ్రామాల నుంచి వలసలను నివారించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2.24 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యంగా చేసుకున్నాం. 
-స్మార్ట్‌ విశాఖగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద రూ.1602 కోట్ల అంచనా వ్యయంతో ఐదేళ్ల కాలవ్యవధిలో అమలు చేయడానికి కార్యాచరణ ఉంది.
-స్వచ్ఛ విశాఖ సాధనకు నగర ప్రజలు సహకరించాలి. 
-గిరిజనుల ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.
-క్రీడా కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారీగా నిధులతో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి, మౌలిక వసతుల కల్ప నకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆస్తుల పంపిణీ..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆస్తుల పంపిణీ జరిగింది. మొత్తం రూ.192.36 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో డీఆర్‌డీఏ నుంచి 8,297 గ్రూపులకు 159.16 కోట్లు, బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి కింద 1992 గ్రూపులకు రూ.24.28 కోట్లు, ఏపీఆర్‌ఐజీపీ కింద 1365 రైతులకు 1.09 కోట్లు, బీసీ కార్పొరేషన్‌ నుంచి 30 మంది లబ్ధిదారులకు రూ.21 లక్షలు, ఎస్పీ కార్పొరేషన్‌ నుంచి 106 మంది లబ్ధిదారులకు రూ.7.57 కోట్లు, 80 మంది విభిన్న ప్రతిభావంతులకు 15 ట్రైసైకిల్స్‌ , 20 వీల్‌ చైర్స్, వినికిడి యంత్రాలు, తదితర ఆస్తులను పంపిణీ చేశారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో భాగంగా పలువురికి ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖñ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, జీసీసీ ఎండీ టి.బాబురావునాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ టి.శివశంకర్, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిష్ట, డీఆర్‌వో ఎం.శ్రీదేవి, ఏవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్,³ పద్మశ్రీ కూటికుప్పల సూర్యరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు కె.ప్రసాద్‌రెడ్డి, రొంగలి జగన్నథం, పక్కి దివాకర్‌ పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement