
నిడమర్రు : స్వాతంత్య్ర దినోత్సవం వస్తుందటే మూడురోజుల ముందు నుంచే పాఠశాలల్లో సందడే సందడి. పిల్లలకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం, బహుమతులు అందించడం, మువ్వన్నెల జెండాలు ఎగురవేయడం, చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చెయ్యడం, దేశభక్తిని, జాతీయ నాయకులను స్మరించుకునే ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఈ ఏడాది ఆటల పోటీల విజేతలకు బహుమతులివ్వాలన్నా.. చిన్నారులకు చాక్లెట్లు పంచాలన్నా.. పాఠశాలకు వచ్చిన అతిథులకు అల్పాహారం ఇవ్వాలన్నా ప్రధానోపాధ్యాయులు అప్పులు చేయాల్సిందే. ప్రచారానికి, ఆర్భాటాలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల్లో సంబరాల కోసం నయాపైసా విదల్చలేదు. కానీ ప్రతి స్కూల్లో స్వాత్రంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు మాత్రం జారీ చేశారు.
నేటికీ నిర్వహణ నిధుల ఊసేలేదుపాఠశాల తెరిచి రెండు నెలలవుతున్నా నేటికీ పాఠశాల నిర్వహణ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో స్వాతంత్య్ర వేడుకలను ఎలానిర్వహించాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల బ్యాంకు ఖాతాలు చూస్తే చిల్లిగవ్వ లేదు. రేపు 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయాలనే అంశం గుర్తుకు రాలేదా అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నిధులు మంజూరు ఇలా
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ చేసేది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల గ్రాంటు, నిర్వహణ గ్రాంటులను పాఠశాల స్థాయి, విద్యార్ధుల సంఖ్యను బట్టి విడుదల చేసేవారు. ఈ నిధులతో పాఠశాలకు రంగులు వేయడం, మైనర్ రిపేర్లు, విద్యా బోధనకు అవసరమైన చాక్‌పీసులు, డస్టర్లు, రికార్డులు, విద్యార్థుల హాజరుపట్టీలు కొనుగోలు చేస్తారు. విద్యుత్ బిల్లులు, జాతీయ పండుగలు జరుపుకునేందుకు అవసరమైన ఖర్చులకు ఈ నిధులు వినియోగించుకోవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా నేటికీ ఒక్క పైసా ఇవ్వకపోగా గత నెలలో ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిల్వ ఉన్న మొత్తం నిధులు ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది.
నిధుల కోసం ఎదురు చూపులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే ఆటలు, క్విజ్, వ్యాసరచన, డిబేట్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి స్వాతంత్య్ర దినోత్సవం నాడు బహుమతులు అందించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిధులు విషయం మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటికే పాఠశాలల్లో విద్యుత్ బిల్లులు, పారిశుధ్యం తదితర నిర్వహణ ఖర్చులు హెచ్‌ఎంలే భరిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ ఖర్చులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంటాయని ఉపాధ్యాయులు చెపుతున్నారు. కొన్ని చోట్ల బహుమతులు అందించేందుకు హెచ్‌ఎంలు దాతల సహకారం కోరుతున్నారు.
పోటీలు నిర్వహించి బహుమతులు అందించాల్సిందే
విద్యాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అం దించాల్సిందే. పలువురు హెచ్‌ఎంలు బహుమతుల ఖర్చుల కోసం స్థానికంగా ఉండే దాతల సహాయం కోరుతున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏలను మిళితం చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌గా మార్పుకోసం ఖాతాల్లో ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదు. – వంగపండు నర్శింహారావు, ఎంఈఓ