నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధి : శాం పిట్రోడా
పుట్టపర్తి, న్యూస్‌లైన్: నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు యువత కృషి చేయాలని ప్రధాన మంత్రి సలహాదారు శాం పిట్రోడా పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో శుక్రవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారత్ నేడు ఎంతో అభివృద్ధి చెందిందని, అన్ని రంగాల్లోనూ అగ్రదేశాలతో పోటీ పడుతోందని చెప్పారు. బయోటెక్, ఆటమిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఎంతో వేగంగా దూసుకుపోతోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని తెలిపారు. అయితే, మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఇంకా అనేకం ఉన్నాయని వివరించారు. ప్రతి వ్యక్తి స్వీయ పరివర్తన ద్వారా అభివృద్ధి మార్గంలో నడవాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, కష్టపడేతత్వాన్ని పెంపొందించేలా విద్యావిధానాన్ని కొనసాగించడం సత్యసాయి విద్యాసంస్థలకే సాధ్యమన్న విషయాన్ని తాను గ్రహించానని శాం పిట్రోడా అన్నారు.
సవాళ్లను అధిగమించడంలో విద్యా సంస్థల పాత్ర కీలకం
సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన విద్యనందించే గొప్ప విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పారని కొనియాడారు. సమాజాభివృద్ధికి దోహదపడే అనేక ప్రయోగాలు నేడు విద్యాలయాల్లోనే కొనసాగుతున్నాయని చెప్పారు. పుట్టపర్తిలోని సత్యసాయి విద్యాసంస్థలు అటువంటి ప్రయోగశాలలుగా వెలుగొందుతున్నాయన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన 25 మంది విద్యార్థులకు వెంకటాచలయ్య బంగారు పతకాలు ప్రదానం చేశారు.