సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికా, బ్రిటన్ తదితర అగ్ర రాజ్యాల కంటే భారత్ ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వపరంగా సన్నద్ధత సూచీలో మన దేశం ఆగ్రస్థానంలో నిలిచిందని ‘ఆక్స్‌ఫర్డ్ కోవిడ్–19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్ (ఓఎక్స్‌సీ జీఆర్‌టీ) నివేదిక పేర్కొంది. ఆ నివేదికను శనివారం విడుదల చేశారు.
6 దేశాలు.. 33 రోజులు
► కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ప్రభుత్వాల సన్నద్ధత, తీసుకున్న చర్యలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం జరిపింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
► వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న మార్చి 9 నుంచి ఏప్రిల్ 10 వరకూ ప్రభుత్వాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. 12 అంశాల ప్రాతిపదికగా అధ్యయనం చేశారు.
అగ్ర భాగాన భారత్
► భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలను విశ్లేషించారు. అన్ని విభాగాల్లో భారత్ అగ్రభాగాన ఉందని ప్రకటించారు.
► ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడమే కాకుండా ద్రవ్య వినిమయం పెంచేందుకు చర్యలు తీసుకుందని కొనియాడింది.
నూటికి నూరు..
► సన్నద్ధత సూచీలో మార్చి 9న 47.6 పాయింట్ల వద్ద ఉన్న భారత్ ఏప్రిల్ 10 నాటికి 100 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
► దేశంలో లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి 25 నుంచి దాదాపు 100 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
► స్పెయిన్, ఇటలీ 95.20 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. 80.90పాయింట్లతో జర్మనీ మూడో స్థానం, 71.40 పాయింట్లతో బ్రిటన్ నాలుగో స్థానం, 66.70పాయింట్లతో అమెరికా ఐదో స్థానంలో ఉన్నాయి.
12 అంశాలు ఏమంటే..
► విద్యాసంస్థలు, కార్యాలయాలు, పని ప్రదేశాలను మూసివేయడం. సభలు, సమావేశాలు వంటివి రద్దు చేయడం.
► ప్రజా రవాణా నిలిపివేయడం. ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను చేపట్టడం.
► ప్రజల కదలికలు, రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించడం. అంతర్జాతీయ విమాన, నౌకాయాన సర్వీసులను నిలిపివేయడం.
► ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తక్షణ చర్యలు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం.
► వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యవసర నిధుల కేటాయింపు. వ్యాక్సిన్ల తయారీకి నిధులు కేటాయింపు.
► యుద్ధ ప్రాతిపదికన ల్యాబొరేటరీలు, ఇతర పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం. వైరస్ సోకినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించడం.
Comments
Please login to add a commentAdd a comment