బాబూ.. ఇదేనా నీ పారిశ్రామిక విధానం?
- రైతుల భూములపై నీకున్న హక్కేమిటి?
- అమ్మిన వారెవరైనా ఆ భూముల్లో మళ్లీ వ్యవసాయం చేస్తారా..
- మంత్రి ఉమా మాఫియా లీడర్
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘బాబూ.. నీ పారిశ్రామిక విధానం ఏమిటో చెప్పు.. విదేశీ పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నావ్.. మన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు కనీస సహకారం ఇవ్వడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నావు.. ఇదేనా నీ పారిశ్రామిక విధానం..’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
శుక్రవారం సాయంత్రం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలోని సరస్వతీ పవర్ కంపెనీకి మైనింగ్ లీజును రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తానని చెబుతున్న చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నాడనేది దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు.
2009 జూన్‌లో 1,515 ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతి ఇస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, 2012లో పర్యావరణ అనుమతులు కేంద్రం ఇచ్చిందని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులకు అనుమతులు ఇవ్వలేదని వివరించారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్ ప్లాంటును ప్రారంభించేందుకు రావాల్సిన అనుమతులు రాకుండా అడ్డుకున్నది టీడీపీ నేతలేనన్నారు. ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని సారథి ప్రశ్నించారు.
ఉమ ఓ మాఫియా నేత..
మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాఫియా లీడర్‌గా వ్యవహరిస్తున్నారని, కొందరు రైతులను రెచ్చగొట్టి పొలాల్లోకి వెళ్లేలా చేసింది టీడీపీ వారేనని సారథి చెప్పారు. గతంలో రియల్ ఎస్టేట్ వారికి రైతుల భూములు అమ్మారని, ఇప్పటివరకు ఈ భూముల్లో భవనాలు నిర్మించలేదని, ఇప్పుడు రేట్లు పెరిగాయని ఆ రైతులు తమ పొలాలంటూ భూములు దున్నగలరా? ఇవేనా మంత్రి రైతులకు నేర్పే పాఠాలు? అని పార్థసారథి ప్రశ్నించారు. ఎక్కడ ఏమి జరిగినా దానిని జగన్‌కు ఆపాదిస్తున్నారన్నారు. సరనస్వతీ కంపెనీకి పక్కనే భవ్య సిమెంటు కంపెనీ ఉందని, వీరు వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు.ఎకరాకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు మాత్రమే ఇచ్చారని, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రైతులను బెదిరిస్తున్నారు
రాజధాని నిర్మాణానికి భూములు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇవ్వకుంటే నిబంధనల ప్రకారం అక్వయర్ చేస్తామని రైతులను చంద్రబాబు, స్థానిక మంత్రులు బెదిరిస్తున్నారని పార్థసారథి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతి ప్రకారం ఇస్తే భవిష్యత్‌లో మంచి ధర వస్తుందని మభ్యపెడుతున్నారని తెలిపారు.
చంద్రబాబు అబద్ధమే చెబుతాడు
క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని చంద్రబాబు ప్రకటించాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు రెండు రోజుల క్రితం వినుకొండలో జరిగిన జన్మభూమి సభలో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోనే రాజధాని ఉంటుందని చెప్పాడని, అబద్ధమాడుతున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలన్నారు.
ఐదేళ్ల వరకు రైతు రుణాలు మాఫీ కావు
చంద్రబాబు చెబుతున్న ప్రకారం రైతుల రుణాలు ఈ ఐదేళ్లలో రద్దయ్యే అవకాశం లేదని స్పష్టమైందని పార్థసారథి చెప్పారు. బ్యాంకులకు ఇంతవరకు రుణమాఫీ ఉంటుందనే హామీ కూడా రాలేదని, కేవలం మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర ఇండియన్ బ్యాంకులో ఎల్‌డీఎం నరసింహారావు మాట్లాడుతూ రైతుల రుణాలు రద్దయ్యే అవకాశం లేదని, తప్పకుండా రుణాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసినందున చంద్రబాబు రుణమాఫీ చేయలేడని రైతులు గుర్తించాలన్నారు.