నకిలీ మందులు ఇవిగో.. | Inferior drug trade business | Sakshi
Sakshi News home page

నకిలీ మందులు ఇవిగో..

Dec 2 2014 2:51 AM | Updated on Sep 2 2017 5:28 PM

జిల్లాలో నకిలీ, నాసిరకం మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో..

జిల్లాలో నకిలీ, నాసిరకం మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో.. విదేశీ పర్యటనల మోజుతో.. నాసిరకం మందులు రాస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, హిందూపురంతో పాటు పలు పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. వీరితో పాటు కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా ‘నకిలీ’ మందులతో జోరో బిజినెస్ చేస్తున్నారు.  
 
అనంతపురం నగరానికి చెందిన సుధాకర్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులైనా జ్వరం తగ్గక పోవడంతో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఆ వైద్యుడు నాలుగు రకాల మాత్రలు రాసిచ్చాడు. సమీపంలో ఉన్న మెడికల్ స్టోర్‌లో ఆ మందులు కొనుక్కొని వెళ్లి వైద్యునికి చూపించగా, అవి ఎలా వాడాలో వివరించి పంపించాడు. వారం గడిచినా జ్వరం తగ్గక పోవడంతో మరో వైద్యుడి వద్దకు వె ళ్లాడు. ప్రస్తుతం వాడుతున్న మందులను చూపించగా, అన్ని మాత్రలు బ్రాండెడ్ కంపెనీవే అని, అరుుతే అందులో రెండు మాత్రలు బ్రాండెడ్ కంపెనీ పేరును పోలివున్న కంపెనీ నాసిరకం మందులని తేల్చి చెప్పాడు. రెండు కంపెనీల పేర్లు ఒకటే అరుునా స్పెల్లింగ్‌లో మాత్రం తేడా ఉంది. నాసిరకం మందులు అంటగట్టారని తెలుసుకున్న బాధితుడు వాపోవడం తప్ప ఏమీ చేయలేకపోయూడు.
 
సాక్షిప్రతినిధి, అనంతపురం : కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో జిల్లాలో ‘నకిలీ మందుల’దందా పెద్ద ఎత్తున సాగుతోంది. మందుల తయారీ కంపెనీలు కొందరు వైద్యులతో నేరుగా సంబధాలు పెట్టుకుని వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులు ఉండ వు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల ‘నకిలీ’ మందులనే రోగులకు రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.

లక్ష రూపాయల విలువైన కాంట్రాక్ట్ బేసిస్ మందులు విక్రయిస్తే డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు 15-20 వేల రూపాయల దాకా ముట్టజెప్పుతున్నారు. వీటితో పాటు మూన్నెళ్లకోసారి ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, బ్యాంకాక్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు పంపుతున్నారు. దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటల్స్‌లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల ‘అండ’ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తుంది. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది.
 
నకిలీ మందులు ఇవిగో..
తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ‘కక్కుర్తి డాక్టర్లు’ వాటిని రాయకుండా ఎక్కువ లాభాలు వచ్చే జెనరిక్ బ్రాండ్లను రాసి పంపుతున్నారు. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’అనే రెండు రకాల కంపెనీల పేరుతో ఉన్న జెనరిక్ మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్  స్థానంలో ఓ...సె..., ఆ... పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రజోల్ స్థానంలో ‘ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా లాభాలు దండుకుంటున్నారు.

ఇందులో నుంచి కొంత పర్సంటేజీలను వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఇలా నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. 15 రోజుల కిందట అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో రిజిస్ట్రేషన్ ఫైళ్ల పరిశీలన పేరుతో ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దుకాణాన్ని బట్టి నెలకు 3-10 వేల రూపాయల మామూళ్ల విధించి వసూళ్లకు పాల్పడ్డారు. ఇదే విషయాన్ని కొందరు దుకాణాల నిర్వాహకులు ధ్రువీకరిస్తున్నారు.

అర్హత లేనివారు మెడికల్ స్టోర్లలో
జిల్లాలో దాదాపు 2వేలు - 2,500 మెడికల్ స్టోర్లు ఉన్నాయి. వీటిలో చాలా మెడికల్ స్టోర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. బీ ఫార్మసీ పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మందుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. రోగులకు ఔషధాలు అందజేసేందుకు కచ్చితంగా ఫార్మసిస్టులనే నియమించాలి. వీరు తెల్లటి ఆఫ్రాన్ ధరించి మందులు ఇవ్వాలి. జిల్లాలో చాలా వరకు మందుల దుకాణాల యజమానులు ఫార్మాసిస్టులను నియమించుకోకుండా పదో తరగతి, ఇంటర్మీడియట్ తప్పిన వారిని నియమించి విక్రయాలు సాగిస్తున్నారు.

దీంతో అవగాహన లేక డాక్టరు రాసిన చీటిలోని మందుల వివరాలు అర్థం కాక ఇతర మందులను ఇస్తున్నారు. వైద్యులు వాటిని చూసి తాము రాసిన మందులు ఒకటైతే...ఇచ్చింది వేరే ఔషధాలని తిప్పి పంపిన సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక వినియోగదారులు దుకాణదారులతో గొడవపడి వెళ్లిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement