
ఇన్‌ఫ్లుయెన్స్ లేకుంటే ఇంటిలిజెన్స్‌కే..
మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ పాలనలో మొదలైన సిఫార్సుల పోస్టింగ్‌లు
పరపతి లేని పోలీసులు పొరుగు జిల్లాలకే
నోట్ : పోలీస్ క్యాప్ వాడండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ పాలనలో మొదలైన సిఫార్సుల పోస్టింగ్‌లు పోలీసు శాఖను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని ఎస్సై, సీఐ, డీఎస్పీల బదిలీలు చేపట్టడంతో ‘పరపతి’ లేని పోలీసులు అన్యాయమైపోతున్నారు. ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నప్పటికీ కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలు తెచ్చుకోలేని కారణంగానో లేదా.. పైరవీకారుల సిఫార్సులు లేకపోవడం వల్లనో కొందరు ఖాకీలు లూప్‌లైన్‌లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇంటలిజెన్స్ విభాగానికి బదిలీ అవుతున్నారు. ప్రజాప్రతినిధుల అండగల పోలీసులకు మాత్రం ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కీలకమైన లా అండ్ ఆర్డర్ పోస్టింగులే దక్కించుకుంటున్నారు.
ఇంటిలిజెన్స్‌కు ఆరుగురు
జిల్లాలోని వివిధ స్టేషన్లల్లో పనిచేస్తున్న ఆరుగురు ఎస్సైలను ఇటీవల హైదరాబాద్‌లోని ఇంటలిజెన్స్ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని అడిషనల్ డెరైక్టర్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వారిని ఆదేశించారు. వీళ్లంతా మూడేళ్లపాటు ఆ విభాగంలో పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆచంట ఎస్సై పి.విశ్వం, భీమవరం టూటౌన్ ఎస్సై పి.విష్ణుమూర్తి, డీసీఆర్‌బీ ఎస్సై కె.చిరంజీవి, పెదవేగి డీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న కె.స్వామి, ఏలూరు ట్రాఫిక్ ఎస్సై కేవీఎస్‌వీ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వి.వెంకటేశ్వరరావులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బదిలీ లేఖలను తీసుకుని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఉన్నతాధికారులు ‘ఇక్కడేం చేస్తారు. విజయవాడ వెళ్లండి’ అని తిప్పి పంపినట్టు తెలుస్తోంది. కేవలం పైరవీలు చేతకాకపోవడం వల్లనే ఆ ఆరుగురిని జిల్లా దాటి పంపించివేశారన్న వాదనలు పోలీసు శాఖలో వినిపిస్తున్నాయి.