విజయనగరం రూరల్: జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో 202 మద్యం దుకాణాల నిర్వహణకు (2015-17) ఎక్సైజ్ అధికారులు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి మూడు రోజులు కేవలం ఒకటే దరఖాస్తు రాగా నాలుగో రోజు 340 వరకు వచ్చాయి. ఆఖరి రోజైన శనివారం 182 మద్యం దుకాణాలకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. కలెక్టరేట్ ఆడిటోరి యంలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణకు ఔత్సాహికులు అధిక సంఖలో హాజరై దరఖాస్తులు అందజేశారు.
సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు 160 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఔత్సాహికులు అ దిక సంఖ్యలో ఉండడంతో జిల్లాలోని 182 దుకాణాలకు సు మారు రెండు వేల వరకు దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 28న దరఖాస్తుల పరిశీలన, 29న లాటరీ నిర్వహించి 30 నుంచి దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేయడం జరుగుతుందని ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ పి.సురేంద్రప్రసాద్ తెలిపారు. అర్ధరాత్రి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగింది. అయితే పాటదారులు అధిక సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. దరఖాస్తుల స్వీకరణలో ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయల ఆదాయం
లెసైన్స్ ఫీజు రూపంలో 2015-16 సంవత్సరానికి విజయనగరం డివిజన్‌లో ఉన్న 123 దుకాణాలకు సుమారు 43.77 కోట్ల రూపాయలు, పార్వతీపురం డివిజన్‌లోని 59 దుకాణాలకు 20.92 కోట్ల రూపాయల ఆదాయం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే దరఖాస్తుల చలానా రూపంలో సుమారు ఆరు కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 202 దుకాణాలకు 1583 దరఖాస్తులు రాగా సుమారు ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
10 శాతం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో సుమారు ఏడు కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖ కోల్పోయింది. అలాగే లెసైన్స్ ఫీజు ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో దుకాణ ఏర్పాటుకు రూ. 30 లక్షలు, 10 వేల లోపుంటే రూ. 34 లక్షలు, 25 వేల లోపుంటే రూ. 37 లక్షలు, 50 వేల లోపుంటే రూ. 40 లక్షలు, 3 లక్షల లోపుంటే రూ.45 లక్షలు, ఐదు లక్షల జనాభా ఉంటే రూ. 50 లక్షలు వసూలు చేయనున్నారు. ఐదు లక్షల పైబడి జనాభా ఉంటే 65 లక్షల రూపాయల ఫీజుగా నిర్ణయించారు.
20 చోట్ల ప్రభుత్వ దుకాణాలు
జిల్లాలోని 202 దుకాణాల్లో 10 శాతం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని విజయనగరం సర్కిల్-1లో రెండు, సర్కిల్-2 లో ఒకటి, భోగాపురం సర్కిల్ పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో ఒక్కోటి, చీపురుపల్లి సర్కిల్ పరిధిలోని చీపురుపల్లి, గరివిడి మండల కేంద్రాల్లో ఒక్కక్కటి, నెల్లిమర్ల సర్కిల్ పరిధిలోని నెల్లిమర్ల మండల కేంద్రంలో ఒకటి, గజపతినగరం సర్కిల్ పరిధిలోని గజపతినగరం మండల కేంద్రంలో ఒకటి, బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ఒకటి, ఎస్.కోట సర్కిల్ పరిధిలోని ఎస్.కోట, కొత్తవలస మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి, గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్‌లో ఒక దుకాణం ఏర్పాటు చేయనున్నారు. అలాగే పార్వతీపురం డివిజన్‌లో బొబ్బిలి సర్కిల్ పరిధిలోని బొబ్బిలి, బలిజిపేట మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి, తెర్లాం సర్కిల్ పరిధిలోని బాడంగి మండల కేంద్రంలో ఒకటి, సాలూరు సర్కిల్ పరిధిలోని సాలూరు మున్సిపాలిటీలో ఒకటి, రామభద్రాపురం మండల కేంద్రం లో ఒకటి ఏర్పాటు చేస్తారు. పార్వతీపురం సర్కిల్‌లో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, గరుగుబిల్ల మండలం ఉల్లిబద్రలో ఒక దుకాణం ఏర్పాటు చేయనున్నారు.
మద్యం షాపుల కోసం దరఖాస్తుల వెల్లువ
Published Sun, Jun 28 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement