ఇన్‌ఫ్రా చట్ట పరిధి కుదింపు
- సింగపూర్ కన్సార్టియం కోసం చట్టంలో మార్పులు
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
- ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాల్లో పూర్తిగా కోత
- చట్టం మార్పు వివరణపై మంత్రుల తడబాటు
సాక్షి, అమరావతి: అనుకున్నట్లే అయింది. సింగపూర్ కన్సార్టియం కోసం ఏపీఐడీఈ (ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్) చట్టంలో మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలను పూర్తిగా తగ్గించి అంతా ప్రభుత్వం చెప్పు చేతల్లోనే జరిగేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని స్టార్టప్ ఏరి యా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఈ చట్టాన్ని ప్రభుత్వం సవరించనుందనే విషయాన్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టిన విష యం తెలిసిందే. ఈ చట్టంలో మార్పులకు చర్చ లేకుండానే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ చట్టం సవరణపై చర్చకు రాగానే సీఎం చంద్రబాబు.. రాజ ధాని నిర్మాణం ఆవశ్యకతతో పాటు స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు కేసుల గురించి క్లుప్తంగా వివరించి.. ఆమోదిద్దామని చెప్పటంతో అందరూ ఒకే చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సీఎంబాబు అధ్యక్షతన విజ యవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఎన్‌జీఆర్‌ఏయూ, టూరిజం, రెంట్ కంట్రోల్, ల్యాండ్ కన్వర్షన్, రిజిస్ట్రేషన్ల చట్టాలనూ సవరించేం దుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ వివరాలను మంత్రి పల్లె మీడియాకు వెల్లడించారు. ఏపీఐడీఈ చట్టం 2001ని సవరించేందుకు ముసాయిదా బిల్లు రూపొందిం చేందుకు ఆమోదం తెలిపారు. ఇన్‌ఫ్రా అథారిటీలో సభ్యులే ప్రభుత్వంలోనూ ఉండడంతో ప్రాజెక్టుల ఆమోదానికి ఆలస్యమవుతోందని, దాంతో అథారిటీ పరిధిని, అధికారాలను తగ్గిస్తున్నట్లు చెప్పారు. సింగపూర్ కన్సార్టియం కోసమే చట్టంలో మార్పులు చేస్తున్నారా అని విలేకరులు అడగ్గా ఆయన సమాధానం చెప్పలేదు. రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ అంతకుముందు మిగిలిన విషయాలను మీడియాకు వివరించి ఈ అంశంపై మాట్లాడకుండా జారుకున్నారు.
► ఏపీ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు-2016 ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోదం.
► ఏపీ అద్దె నియంత్రణ బిల్లు-2011 స్థానంలో ఏపీ అద్దె నియంత్రణ బిల్లు-2016 ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఇందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రూపొందించాలని న్యాయ శాఖను కోరుతూ నిర్ణయం.
► వ్యవసాయేతర అవసరాల కోసం ఏపీ వ్యవసాయ భూముల చట్టం-2006లో సవరణకు అనుమతి. రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేందుకు వీలు కల్పించాలని నిర్ణయం.
► రాష్ట్రంలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఉడా)లు ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం. అనంతపురం, కాకినాడ, కర్నూలు, నెల్లూరు కేంద్రాలుగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు అనుమతి.