
టీడీపీలో కురుబలకు అన్యాయం
కళ్యాణదుర్గం :
టీడీపీలో కురుబలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఆ కుల నాయకులను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో కురుబలకు సముచిత స్థానమే ఉంటే పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ఆయన నిలదీశారు. ఆదివారం స్థానిక కనకదాసు కల్యాణ మండపంలో నిర్వహించిన కురుబ విద్యార్థులకు కనకదాసు ప్రతిభ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్ అధ్యక్షత వహించారు. జగదీష్ ప్రసంగిస్తూ జిల్లాలో 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది కురుబలు ఉన్నారన్నారు. టీడీపీలో గెలుపొందిన ఏకైక కురుబ కులస్తుడైన పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వక పోవడం ఆ పార్టీలో వారికున్న ప్రాధాన్యత అర్థమవుతుందని విమర్శించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుబలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కురుబలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తున్నాయని ఆయన మండిపడ్డాడు. రాయలసీమలోని 40 నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను శాసించే స్థాయిలో కురుబలు ఉన్నా, రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి :
కురుబలు అన్ని రంగాల్లోను రాణించాలని, కురుబ విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరుశురాం పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్, ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమలివరం ఈశ్వరయ్యలు ప్రసంగించారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా, సంఖ్యా బలం కురుబలకు ఉన్నా ఆ దిశగా రాజకీయంగా రాణించలేక పోతున్నారని వాపోయారు. కనకదాసు ప్రతిభ అవార్డుల ద్వారా విద్యా రంగంలో కురుబ విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గొర్రెల పెంపకందారులకు షెడ్ నిర్మాణానికి, కాపర్లు మరణిస్తే అందే పరిహారం పై వివరించారు. అనంతరం 24 మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు. కురుబ సంఘం తాలూకా అధ్యక్షుడు దొణస్వామి, మండలాధ్యక్షుడు ఎర్రిస్వామి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.